రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భీమ్ దీక్షలు చేపట్టింది. అయితే హన్మకొండలో ఓ కార్యకర్త టవర్ ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ దగ్గర ఓ బీజేపీ కార్యకర్త టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు.
సెల్ఫీ వీడియో తీసిన బీజేపీ కార్యకర్త.. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేని వ్యక్తి.. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని మండిపడ్డాడు. తన చావుతో దళితులకు న్యాయం జరుగుతుందంటే.. దానికి సిద్ధమేనని తెలిపాడు.
విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. తమ కార్యకర్తతో మాట్లాడి కిందకు దించారు.