– రైతు సమస్యలే ఎజెండా!
– 6న వరంగల్ లో రాహుల్
– 5న మహబూబ్ నగర్ లో నడ్డా
– పోటాపోటీగా సభలు
– రెండు పార్టీల కార్నర్ కేసీఆరే
– అన్నదాతల ఆక్రందనలపైనే ఫోకస్
– హీటెక్కనున్న తెలంగాణ పాలిటిక్స్
రెండు పర్యాయాలు పాలించి ముచ్చటగా మూడోసారి గెలవాలనేది కేసీఆర్ ప్లాన్. దానికి తగ్గట్టే ఆయన ప్లాన్స్ లో ఆయన ఉన్నారు. అయితే.. జాతీయ రాజకీయాల అంటూ తిరుగుతూ కేంద్రాన్ని టార్గెట్ చేయాలని చూసి ఘోరంగా దెబ్బతిన్నారు. అటు చూస్తే ప్రాంతీయ పార్టీలు కలిసి రావడం లేదు.. ఇటు చూస్తే ధాన్యం కొనుగోళ్ల విషయంలో షో అట్టర్ ఫ్లాప్ అయింది. రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కేసీఆర్ ఉన్న ఈ సంక్లిష్ట సమయంలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు.
రాష్ట్ర రైతాంగం దృష్టిలో కేసీఆర్ ను మరింత విలన్ గా మార్చేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపుతున్నాయి. ముందుగా కాంగ్రెస్ విషయానికొస్తే.. ఈనెల 6న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు రాహుల్ గాంధీ. వరంగల్ లో రైతు సంఘర్షణ సభకు ప్లాన్ చేసింది రాష్ట్ర శాఖ. రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల బాధలను వెలుగులోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. సభా వేదిక మీదకు వారిని తీసుకొచ్చి రాహుల్ తో ముఖాముఖి నిర్వహించాలని చూస్తున్నారు. రాహుల్ సభ ద్వారా రైతుల సమస్యలనే హైలెట్ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్.
ఇక రాహుల్ రాకకు ఒకరోజు ముందే.. అంటే 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహబూబ్ నగర్ వస్తున్నారు. అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇది కూడా రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా జరగబోతోంది. కేసీఆర్ పాలనలో అన్నదాతలు పడుతున్న కష్టాన్ని అందరికీ తెలిసేలా ఈ సభ ఉంటుందని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఒకవైపు రాహుల్.. ఇంకోవైపు నడ్డా.. ఇద్దరూ టార్గెట్ చేయబోయేది కేసీఆర్ నే. అయితే.. ఇక్కడ ఎక్కువగా ఫోకస్ అయ్యేది ధాన్యం కొనుగోళ్ల అంశమేనని అంటున్నారు రాజకీయ పండితులు.
రా రైస్ మాత్రమే ఇస్తామని కేంద్రంతో ఒప్పందాలు చేసుకున్నాక.. అలా కుదరదు మొత్తం ధాన్యం కొనాల్సిందేనని రివర్స్ అయ్యారు కేసీఆర్. ఈ క్రమంలోనే యాసంగిలో వరి వేయొద్దని రైతులకు సూచించారు. ఆయన మాట విని చాలామంది పంటే వేయలేదు. పండిన పంట కొంటారా లేదా? అని ఢిల్లీకి వెళ్లి మరీ ధర్నా చేశారు కేసీఆర్. ఒప్పందం ప్రకారమే కొనుగోళ్లు ఉంటాయని.. రాజకీయ నాటకాలు ఆపాలని కేంద్రం నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రావడంతో మొత్తం ధాన్యం తామే కొంటామని ప్రకటించారు. ఈ ఓవరాల్ గొడవలో కేసీఆర్ షో అట్టర్ ఫ్లాప్ అయిందని విశ్లేషకులు మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. పైగా మొత్తం ధాన్యం కొంటామని ప్రకటన చేసి ఇన్ని రోజులు అయినా ఇంతవరకు సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న జేపీ నడ్డా.. రాహుల్ గాంధీ ధాన్యం విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో జాతీయ నేతల రాకతో రాజకీయ వేడి కూడా రగులుకుంటుందని అంచనా వేస్తున్నారు.