టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీ బోర్డు తీరుపై విమర్శలు వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
తార్నాకలోని ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును సైతం రద్దు చేయాలని, పేపర్ల లీకేజీ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్శిటీ లైబ్రరీ నుండి కళాశాల వరకూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి, ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ లైబ్రరీ నుంచి లా కళాశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పేపర్ల లీకేజీ ఇష్యూ పై గవర్నర్ తమిళి సై స్పందించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. మరో వైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై నిరుద్యోగులు, విద్యార్థులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
దీనికి కేటీఆర్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకు నిరసనగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు.
దీంతో పోలీసులకు వాళ్లకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కరీంనగర్, శంషాబాద్, జనగామ, మంచిర్యాలలో కలెక్టరేట్ల ముందు బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీ నేతల ఆందోళనతో కలెక్టరేట్ల ఆవరణల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.