మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్–బీజేపీలు ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎంపీ ఎన్నికల్లో గెలుపు గాలివాటం కాదని నిరూపించుకునేందుకు బీజేపి, బీజేపీ ఎంపీలున్న చోట్ల గెలిచి… తమకు ప్రత్యామ్నయం కావాలనుకుంటున్న ఆశలకు గండికొట్టాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
కోర్టు ఇష్యూలతో… జులై-ఆగస్టులోనే జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు వాయిదాపడ్డా, ఏ క్షణమైన కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో బీజేపీ-టీఆరెఎస్ లు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాయి. అయితే… కొంతకాలంగా బీజేపీ-టీఆర్ఎస్ నేతల మద్య మాటల యుద్దం నడుస్తోంది. ఆరోపణలు-ప్రత్యారోపణలతో రెండు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. రాబోయే మున్సిపోల్స్ లో ఒకరిపై ఒకరు పై సాధించుకునేందుకు ఊవ్విళ్లురుతున్నాయి.
అయితే, రెండు పార్టీలకు కీలకమైన స్థానాల్లో నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ హైదరాబాద్ లు కీలకమైనవి. ఇక్కడ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై బీజేపీ గెలుపొందింది. నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు ఓడిపోగా, ఉద్యమకాలం నుండి టీఆర్ఎస్ కు అండగా ఉన్న కరీంనగర్ కూడా బీజేపీవైపు మొగ్గుచూపింది. దీంతో ఈ రెండు స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగగా, బీజేపీ కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ ను కట్టడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గంగులను మంత్రిని చేయటంతో పాటు, కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ అద్యక్షున్ని టీఆర్ఎస్ లో చేర్చుకుంది. సరిగ్గా అదే సమయానికి బీజేపీ కూడా కరీంనగర్ లో కేంద్రమంత్రుల సమక్షంలో పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.
ఇక నిజామాబాద్ లోనూ అంతే. ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం దాడిని షురూ చేయగా… అరవింద్–డీఎస్ ద్వయం కూడా చాపకింద నీరులా పనిచేసుకుంటూ పోతుంది. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తర్వాత కరీంనగర్, నిజామాబాద్ లు కీలకమైనవి. దీంతో… బీజేపీ తన పట్టును నిలుపుకునే వ్యూహా రచన చేస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్లలోనూ ముందుస్తు ఎన్నికలకు కేసీఆర్ ఆలోచిసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే… ఈసారి గ్రేటర్ లోనూ ఎంఐఎంను తలదన్నే రీతిలో కనీసం రెండో స్థానానికి అయిన ఏగబాకలన్న కసితో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు స్థానికంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. అందుకే ఈ వారం రోజుల్లోనే బీజేపీ కిషన్ రెడ్డితో కలిపి ముగ్గురు కేంద్రమంత్రులను పార్టీ పటిష్టత కోసం… రాష్ట్రానికి పంపింది. అయితే గతంలో మాదిరిగా ఈసారి కేంద్రమంత్రులు కేసీఆర్ పనితీరును పొగడకుండా, రాజకీయ విమర్శలతో కేసీఆర్ పై విరుచకపడటం విశేషం.