– మీరు చేస్తే యుద్ధం..ఇతరులది ధిక్కారం
– గుమాస్తా తెలంగాణ రాసిందే వేదం
– ప్రజల పక్షాన అవినీతిని ప్రశ్నిస్తే..క్షుద్రం
– మీరు చేస్తే సకలజనుల పోరాటం
– మిమ్మల్నిప్రశ్నిస్తే.. తిరుగుబాటు ముద్ర
– ఏ రోజుల్లో ఉన్నారు కేసీఆర్..?
– ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా..?
– ఎవరిముందు…ఏ భాష వాడుతున్నారు?
– రాజ్యాంగమన్నా..రాజ్యాంగ వ్యవస్థలన్నా లెక్కలేదా?
మళ్లీ అదే ఫ్రస్టేషన్.. అదే భయం.. గమ్మత్తేంటంటే ఎవరైనా కోపమొస్తే తిడతారు..తప్పుచేస్తే తిడతారు. మనసారు మాత్రం భయపడితే చాలు భాష మారిపోతుంది. తిట్టడమే కాదు..మీడియాను మీదపడి కొట్టినంత పని చేస్తారు. కేసీఆర్ తిట్లపురాణం విన్నప్రతిసారీ రాజకీయ పండితుల్లో అదే ఆశ్చర్యం.. అదేంటి… అసలు అదేం భాష.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధాని అంటే లెక్కలేదు..కేంద్ర ఆర్థికమంత్రి అసలే కళ్లకు కనబడరు.. పనికిమాలిన..సన్నాసి..దద్దమ్మ.. నోటికి ఎంత బూతు వస్తే అంత..దటీజ్ కేసీఆర్. ప్రజా పోరాటాలతో..ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన తెలంగాణ ఉద్యమం అండతో గద్దెనెక్కి..ఇవాళ అవే ప్రజాస్వామ్య వ్యవస్థలను నోటికొచ్చిన భాషతో తూలనాడుతున్న ఓ నాయకుడి నిజస్వరూపమిది.
ఒక రాష్ట్రాన్ని పాలిస్తూ మీరూ బడ్జెట్ ప్రవేశపెడతారు..ఇప్పటికి ఎన్నోసార్లు బడ్జెట్ పెట్టారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా కొందరికి మీ విధానాలు నచ్చుతాయి. కొందరికి నచ్చవు.. అయినా అంతా ఒక పార్లమెంటరీ పద్ధతిలో సాగుతుంటారు. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. అంతమాత్రాన ఎవ్వరూ ఎవ్వరినీ బూతులు తిట్టుకోవాలని లేదే. పైగా అంబేద్కర్ మహాశయుడిని అవమానిస్తూ రాజ్యాంగాన్నేమార్చాలంటూ ప్రేలాపనలు. ఇది కచ్చితంగా కేసీఆర్ భయానికి సంకేతం అంటున్నారు రాజకీయ పండితులు. అసలెందుకీ భయం..? ఏం జరగబోతోందని భయం..? దీనికీ విశ్లేషకుల దగ్గర కొన్నిజవాబులున్నాయి. అయిదారు వందల కోట్లు వెదజల్లినా హుజూరాబాద్ దక్కక పోవటం.. దళిత బంధు వికటించి రివర్స్ కావటం సారువారి ఫ్రస్టేషన్ లో మొదటి మెట్టు అంటున్నారు. దానికితోడు చెరోవైపూ బీజేపీ బండి సంజయ్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మద్దెల దరువు. తెలంగాణవ్యాప్తంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు మొదలుకొని అన్నివర్గాల్లో విపరీతంగా పెరుగుతున్న ప్రజావ్యతిరేకత. అటు.. ఎన్నికలు ఏడాదిలో ఉండటం సారు ఫ్రస్టేషన్ ను విపరీతంగా పెంచుతోందట.
మ్యారేజ్ గేట్ ఎఫెక్ట్..!
ఇక.. ఎప్పుడూ ఉండే బడ్జెట్ పై ఉన్నట్టుండి అంత చీప్ లాంగ్వేజ్ లో మాట్లాడాల్సి వచ్చిందంటే.. మ్యారేజ్ గేట్. అవును..ఇటీవల ఒక ప్రైవేట్ వెబ్ సైట్ కేసీఆర్ సర్కార్ లోని ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో పెళ్లికి..ఒక “మెగా” ఇంజనీరింగ్ కంపెనీ చేసిన భారీ ఖర్చుపై ఉతికి ఆరేసింది. పైగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ప్రాజెక్టుల్లో 70 వేల కోట్ల అవినీతి ఏంటి..? అంటూ ప్రశ్నలు శర పరంపరగా దూసుకురావటమే సారువారి ఫ్రస్టేషన్ కు ముఖ్యకారణం అని భావిస్తున్నారు. బడ్జెట్ ను నోటికొచ్చిన తిట్లు తిడుతూ… మరోవైపు సోషల్ మీడియా క్షుద్రం అంటూ విరుచుకుపడటం వెనక.. మ్యారేజ్ గేట్ కథనానిదే ప్రధాన పాత్ర అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఊ అంటే జైల్లో పెట్టిస్తా అనే బండి మాట..!
ఇక గులాబీ బాస్ ఫ్రస్టేషన్ వెనుక మరో అతి ముఖ్యకారణం.. జైల్లో పెట్టిస్తా అనే డైలాగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పూట భోజనం చేయటమన్నా మరిచిపోతారేమో గానీ.. కేసీఆర్ ను జైలుకు పంపిస్తా హెచ్చరిక కనీసం వారానికోసారి చేయటం మాత్రం మరిచిపోరు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ కోసం ఢిల్లీలో ఉన్న బండి..అక్కడి నుంచి కూడా ఇదే స్వీట్ వార్నింగ్ మరోసారి ఇచ్చారు. అసలు మొన్న బీజేపీ బాస్ నడ్డా .. కాళేశ్వరం అవినీతిపరుల ఏటీఎంలా మారింది అనటం. వేల కోట్ల అవినీతి గురించి సూటిగా ప్రశ్నించటం.. దానికి తోడు జైలుకు…జైలుకు అంటూ బండి పదే పదే తన మాటల బాణాలతో గుచ్చటం సారుకు తలనొప్పిగా మారింది. అందుకే.. సారు ఈసారి ఏకంగా రాజ్యాంగానికే తన బాణాన్ని గురిపెట్టారు. దళితుడిని సీఎం చేయటం నుంచి..వాళ్లకు మూడెకరాల భూమి ఎగ్గొట్టడం నుంచి.. తాజా దళిత బంధు వరకూ ఇచ్చిన మాట తప్పారు. అంతేనా, ఇప్పుడు ఏకంగా దళితులే కాదు భారతీయులంతా గౌరవించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నే అవమానిస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేంద్రానికి సవాళ్లు విసరటం కేసీఆర్ నియంతృత్వానికి పరాకాష్టగా రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఔను మరి .. తెలంగాణలో సారు చెప్పిందే వేదం..ఆయన అనుసరించే రాజ్యాంగం. ప్రశ్నిస్తే కేసులు,జైళ్లు.. అణచివేత ధోరణులు. మీడియా అంటే తన భజన చేయాలి…తన చెప్పు చేతుల్లో ఉండాలి..లేదంటే తన ప్రభుత్వ అవినీతిపై నోరు మెదపకుండా ఉండాలి. కాదంటే ఏమవుతుందో.. చూశాం..చూస్తూనే ఉన్నాం. మరి ఇంత నియంతృత్వంతో.. ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న సారు నోటి నుంచి అంతకంటే గొప్ప పదజాలం ఏం వస్తుందనీ.. ఆ ఫ్రస్టేషన్ లో అంతకన్నా ఏం మాట్లాడతారనేది రాజకీయ విశ్లేషకుల వాదన.