ప్రధాని మోడీ పర్యటన తెలంగాణ రాజకీయాల్ని మరింత హీటెక్కించింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అనేలా పలు అంశాలపై యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రధాని రావడం.. కేసీఆర్ జ్వరమంటూ వెళ్లకపోవడం.. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో మోడీని టార్గెట్ చేయడం చూసి.. అసలు ప్రధానిని పిలవడం ఎందుకు..? అవమానించడం ఎందుకు అనే చర్చ జోరుగా సాగుతోంది.
ముందుగా మోడీకి స్వాగతం విషయంలోనే అసలు వివాదం మొదలైంది. పీకే ప్లానింగో, నానా బూతులు తిట్టి ఏ మొఖం పెట్టుకుని వెల్ కమ్ చెబుతాంలే అనుకున్నారో ఏమోగానీ.. కేసీఆర్ మోడీకి స్వాగతం చెప్పేందుకు వెళ్లలేదు. దీనిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని వస్తే రావాలన్న సోయి లాదా? అంటూ ప్రశ్నించారు. అయితే.. మోడీ టూర్ కంప్లీట్ అయి.. వెళ్తున్న సమయంలో టీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా ఈక్వాలిటీ నినాదాన్ని అందుకున్నారు. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ పోస్టులు పెట్టారు. మోడీ వచ్చింది ప్రైవేట్ ప్రోగ్రామని దానికి కేసీఆర్ స్వాగతం చెప్పడం ఏంటని కొందరు ఎదురుదాడి చేశారు.
టీఆర్ఎస్ వాదనపై బీజేపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. మోడీ ముందుగా వెళ్లింది ఇక్రాశాట్ కని.. అది ప్రభుత్వ కార్యక్రమం కాదా? అని ఎటాక్ చేసింది. పైగా జ్వరమంటూ నాటకాలు ఆడతారా? అంటూ సెటైర్ల వర్షం కురిపించింది. సమతామూర్తి విగ్రహం మోడీ ఆవిష్కరించడం కేసీఆర్ కు ఇష్టం లేదనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై వివాదం నడుస్తుండగానే.. మంత్రి కేటీఆర్ మోడీపై ఘాటైన ట్వీట్ చేశారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనంగా మారిందని అర్థం వచ్చేలా ఆరోపించారు కేటీఆర్. ‘‘పక్షపాతం ఆవిష్కరించబడింది’’ అంటూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హాష్ ట్యాగ్ ను జోడించారు. ‘‘ఇది చూసి వ్యంగ్యం కూడా కొన్ని బిలియన్ల సార్లు మరణించింది’’ అంటూ ట్వీట్ చేశారు.
అంతే.. కేటీఆర్ ట్వీట్ అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే స్వాగతం విషయంలో అవమానించారని బీజేపీ రగిలిపోతుంటే.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా కావాలని మోడీని అవమనకరంగా చేయడానికే కేటీఆర్ చేశారని మండిపడుతున్నారు. కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఆయన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ కు బాగా కాలుతున్నట్లుంది అనే అర్ధం వచ్చేలా రిప్లయ్ ఇచ్చారు. ‘బర్నాల్ మూమెంట్’ అని పోస్ట్ చేశారు. ఇదంతా చూసి టీఆర్ఎస్ తీరు మోడీని అవమానించాలనే లక్ష్యంగానే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.