నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికలో బీజేపీ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రచారంలో ఉన్న పేర్లను కాకుండా.. మరో నేతను తెరపైకి తీసుకొచ్చింది. డాక్టర్ పనుగోతు రవి కుమార్‌ను సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. గతంలో సాగర్ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదిత లేదా ఇటీవలే ఆ పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్‌కు అవకాశం ఇస్తారన్న అంచనాలు ఎక్కువగా వినిపించాయి. కానీ బీజేపీ అనూహ్యంగా పనుగోతు రవికుమార్ పేరును ప్రకటించింది.
లంబాడి సామాజిక వర్గానికి చెందిన రవికుమార్‌ను అభ్యర్థిగా ఎంపిక వెనుక బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్‌లో 43 వేలకు ఓట్లు ఆ సామాజిక వర్గానికి చెందినవారివే ఉండటమే ప్రధాన అంశంగా నిలిచినట్టుగా చెబుతున్నారు. ఎంబీబీఎస్ చదివిన రవికుమార్.. ప్రభుత్వ వైద్యుడుగా పనిచేశారు. కొంతకాలం క్రితమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రైవేట్ ఆస్పత్రులలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. నిర్మల ఫౌండేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ.. సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రవికుమార్ ఎంపిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.