విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఏపీలో రాజకీయంగా వేడెక్కుతోంది. ఇప్పటికే నేతలు దీక్షలకు కూర్చుంటుండగా… స్టీల్ ప్లాంట్ కార్మికులంతా దీర్ఘకాలిక ఉద్యమానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై వేలెత్తిచూపుతున్నాయి.
దీంతో మూడు రోజులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని ఆ పార్టీ నేతల బృందం ఢిల్లీలో మకాం వేసింది. ఇప్పటికే ముఖ్యమైన నేతలను కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం కాకుండా చూడాలని కోరారు. అయితే, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు సోము వీర్రాజు టీం అమిత్ షాను కలవనున్నాయి. మంగళవారమే సోము వీర్రాజు అమిత్ షా అపాయింట్ మెంట్ కోరగా ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.
ఏపీకి, విశాఖ ఉక్కుకు ఎంతో దగ్గరి సంబంధం ఉందని… ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామంటూ బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు.