– వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అవసరం లేదు..
– కేసీఆర్ వన్నీ అబద్ధాలే..
– మీటర్లపై ఆధారాలతో సహా నిరూపిస్తా!
– గన్ పార్క్ దగ్గరకొస్తావా?
– అమరవీరుల స్తూపం దగ్గర తేల్చుకుందాం?
– కేంద్రం మీటర్లు పెట్టమందని నిరూపిస్తావా?
– లేకుంటే.. సీఎం పదవికి రాజీనామా చేస్తావా?
– కేసీఆర్ పై విరుచుకుపడ్డ బండి
కేంద్రాన్ని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టి.. మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ జైలుకు పోవడం గ్యారంటీ అని తేల్చేశారు. అవినీతి చిట్టా బయటపడుతోందని.. ఎంక్వైరీ స్టార్ట్ అయ్యిందని చెప్పారు. దీనికితోడు సీఎం ఇంట్లో సీటు పంచాయితీ ఎక్కువైందని.. అందుకే లేనిపోని కథలన్నీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యానికి కేసీఆర్ చేసిన అవమానానికి యావత్ భారతం సిగ్గుతో తలదించుకుంటోందన్నారు.
పుల్వామాలో పాకిస్తాన్ టెర్రరిస్టులు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను దొంగ దెబ్బతీసి చంపితే మన సైన్యం వాళ్ల ఇండ్లల్లోకి పోయి సర్జికల్ స్ట్రయిక్ చేసిందన్నారు సంజయ్. జనరల్ బిపిన్ రావత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్ పై యావత్ భారతం సంతోషంతో పండుగ చేసుకుందని.. ఒక్క కేసీఆర్, రాహుల్ తప్ప అని విమర్శించారు. ‘కుటుంబాన్ని వదిలి జీవితమంతా భారత దేశ రక్షణ కోసం బార్డర్ లో చలిలో, ఎండలో పనిచేసే సైనికుల త్యాగాలకు ప్రూఫ్ అడుగుతావా? ప్రతి ఒక్కరూ తల్లిని ఎట్ల నమ్ముతారో.. యావత్ భారతం సైనికుల త్యాగాలను నమ్ముతుంది. వాళ్లకు నీలాగా రాజకీయం, స్వార్ధం ఉండదు. పాకిస్తానోడే అడగలే ప్రూఫ్. సర్జికల్ స్ట్రయిక్ అయిన వెంటనే ముందు పాకిస్తాన్ కు సమాచారమిచ్చాకే.. భారత మీడియా ద్వారా ప్రజలకు చెప్పిండ్రు. పాకిస్తాన్ టెర్రరిస్టులను మన సైనికులు చంపితే నీకేం కడుపు మంట. పాకిస్తాన్ కు, నీకు మధ్య బాగా సంబంధాలు పెరిగినట్లుంది. ప్రధాని చెప్పింది నమ్ముతలేవ్… మసూద్ అజహార్ అనేటోడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇండియాలో జరిగిన ప్రతి టెర్రరిస్టు ఎటాక్ వెనుక వాడున్నడు. కొన్ని వేల మంది భారతీయుల చావుకు కారణమైనోడు. వాడు చెప్పింది నమ్ముతవా? నీకు, వాడికి సంబంధమేంది? పాకిస్తాన్ కు నీకు లింకుందా ఏంది? జనరల్ బిపిత్ చేసిన గొప్ప ఘనకార్యాన్ని నువ్వు తప్పుపడతవా? ఆయన చనిపోయినప్పుడు పొగుడుతూ ఎందుకు ట్వీట్ చేసినవ్’ అంటూ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా దేశద్రోహిగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు సంజయ్. కేసీఆర్ లాంటి దేశద్రోహి, పాకిస్తాన్, చైనా ఏజెంట్ తెలంగాణ గడ్డమీద ఉండే అర్హత ఒక్క క్షణం కూడా లేదన్నారు. ప్రజలు, తెలంగాణలోని దేశ భక్తులు ఆయన్ను తరిమి తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెసోళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఈమధ్య కేసీఆర్ రోజూ చదువుతున్నారని అన్నారు బండి. ‘రఫెల్ పై ఓ పెద్ద గాయి గాయి చేసిండ్రు. సుప్రీంకోర్టుకు పోయిండ్రు. త్రివిధ దళాలు సీల్డ్ కవర్ లో నివేదిక ఇచ్చినయ్. పూర్తిగా చూసి సాక్షాత్తు సుప్రీంకోర్టే కొట్టిపారేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. నువ్వు సుప్రీం తీర్పును ప్రశ్నించే తీస్ మార్ ఖాన్ వా? నువ్వు ఇండియన్ ఆర్మీని నమ్మవ్.. ప్రధాని చెబితే నమ్మవ్. సుప్రీంకోర్టును నమ్మవ్. పాకిస్తాన్ టెర్రరిస్టు మసూద్ అజహార్ గాడు చెబితే నమ్ముతవా? బీజేపీ అవినీతి పార్టీయా? మమ్మల్ని తరిమికొట్టకపోతే దేశం ఆగిమైపోతదా? నీలాంటి సన్నాసి అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకుంటరు. భారత చరిత్రలో ఒక్క అవినీతి మరక లేకుండా 8 ఏళ్లుగా ప్రజారంజకంగా పాలిస్తున్న ప్రభుత్వం మాది. ఇది మేం అంటలేం. మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో నువ్వే అన్నవ్. ఇప్పుడు చెప్పు.. మా దిమాక్ కరాబైందా? నీ దిమాక్ కరాబైందా?’ అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.
కాంగ్రెస్ తో కేసీఆర్ కు దోస్తానా రోజురోజుకూ పెరిగిపోతోందని.. నెక్స్ట్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా అయినా ఆశ్చర్యం లేదన్నారు బండి. 2014లో సోనియాగాంధీకి ప్రపోజల్ పెట్టి.. అప్పుడు కాలేదని ఇప్పుడు అడుగుతున్నారేమోనని అనుమానంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులారా.. జర జాగ్రత్త.. మీ నాయకుడు నెక్స్ట్ కేసీఆరే అని అన్నారు ‘విద్యుత్ సంస్కరణలకు సంబంధించి.. ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడినవన్నీ ఎప్పటివో యూపీఏ తెచ్చే ప్రయత్నం చేసిన పవర్ బిల్ ను 2020 ఏప్రిల్ లో కేంద్రం సవరణ చేసింది. ఆ తరువాత 2021 ఫిబ్రవరిలో మరికొన్ని మార్పులు చేసింది. ఫైనల్ గా వచ్చిన ఈ డ్రాఫ్ట్ లో మీటర్లు పెట్టాలని గానీ, సబ్సిడీలు ఎత్తేయాలని లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. 2021 జూలై 21న తయారైన ఆర్డీఎస్ఎస్(రీ వ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం) గైడ్ లైన్స్ తయారు చేసింది. దీనిని ఈ ఏడాది జనవరి 3న అన్ని రాష్ట్రాల సీఎంలకు, డిస్కంలకు సర్క్యూలర్లు పంపించింది. నీకు కూడా వచ్చింది. బహుశా.. నువ్వు సెక్రటరియట్ వెళ్లవు కదా.. ఫాంహౌజ్ లో తాగి పండినట్లున్నవ్. చూడలేదనుకుంటా. ఇది ఆ సర్క్యూలర్లోని ఆ గైడ్ లైన్స్ లోని పేజీ నెంబర్ 3- సెక్షన్ 4.7 చివరి లైన్ లో స్పష్టంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని ఉంది. నేను దీనిని నిరూపించేందుకు సిద్ధం. గన్ పార్క్ వద్దకొస్తా.. అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా? వ్యవసాయ బోర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని చెప్పినట్లు నిరూపిస్తవా? లేకుంటే.. నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా?’ అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారు.
హైదరాబాద్ లోని పాతబస్తీలో 70 నుండి 80 శాతం కరెంట్ బిల్లులు వసూలు అవ్వడం లేదన్నారు సంజయ్. వాటిని వసూలు చేసే దమ్ము కేసీఆర్ కు లేదని విమర్శించారు. కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా బిల్లులు కడతలేవని.. ఆ లాస్ అంతా తీసుకుపోయి రైతుల ఖాతాలో వేస్తున్నారని మండిపడ్డారు. ‘మోడీ సర్కార్ తెచ్చిన సంస్కరణల్లో ఉన్న మెయిన్ విషయం నేను చెబుతున్నా.. కరెంట్ వాడుకుని బిల్లు కట్టని దొంగల్ని పట్టుకోవాలి. నీకు అది చేతగాక రైతులను అడ్డం పెట్టుకుంటున్నవ్. సబ్సిడీ ఎత్తేయాలని బిల్లులో ఎక్కడా లేదు. అయితే ఆ సబ్సిడీ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించాలి. నువ్వు 8 ఏళ్లుగా సబ్సిడీల పైసలియ్యక డిస్కంలను 48 వేల కోట్ల రూపాయల నష్టాల పాల్జేసినవ్. ఏదో ఒకరోజు అవి పూర్తిగా మూతపడి రాష్ట్రమంతా కరెంట్ లేక చీకటైపోయే ప్రమాదం ఉంది. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే 2 లక్షల మెగావాట్లు కూడా మోడీ సర్కార్ వాడటం లేదని కేసీఆర్ అంటుండు. కేసీఆర్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి, వాస్తవ వినియోగ సామర్థ్యానికి చాలా గ్యాప్ ఉంటది. తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ ప్రతిరోజూ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17 వేల 500 మెగావాట్లు. ప్రధాని ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ను కూడా తెలంగాణకు ఇచ్చింది. అందులో రోజుకు 6 వేల నుండి అత్యధికంగా 11 వేల మెగావాట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తున్నం. నువ్వెందుకు వాడుకోవడం లేదు? నీకు కనీస అవగాహన లేదు. స్థాపిత సామర్థ్యానికి, వాస్తవ వినియోగానికి చాలా తేడా ఉంటది. ఉదాహరణకు సోలార్ 20 శాతం, జల విద్యుత్ లో 40 శాతం మాత్రమే వాడుకుంటం. ఎందుకంటే సోలార్ కరెంట్ రాత్రిళ్లు పనిచేయవ్. జల విద్యుత్ ఎండా కాలంలో సాధ్యం కాదు. ఈ మాత్రం కూడా తెల్వకుండా నువ్వెట్లా సీఎం అయినవో అర్ధం కావడం లేదు’ అంటూ మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని ఘోరంగా చేసిన అవమానాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరింత నీచంగా కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు బండి. రాజ్యాంగానికి దళితులకు సంబంధమేంటి? అంటవా? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను దళిత, బడుగు బలహీనవర్గాలు దేవుడిగా భావిస్తాయని గుర్తు చేశారు. అంబేద్కర్ ను అవమానిస్తే దళిత, బడుగు, బలహీనవర్గాలకు అవమానించినట్లేనని తెలిపారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలనుకుంటున్నారో కేసీఆర్ చెప్పిన విషయాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ‘చైనా లాంటి రాజ్యాంగం కావాలంట. ఎందుకంటే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సచ్చేదాకా ఆ దేశానికి నియంతగా ఉండాలని రాజ్యాంగాన్ని మార్చుకున్నడు. మన సార్ కూడా అంతే. ఉన్నన్ని రోజులు తాను, కుటుంబ సభ్యులే తెలంగాణకు శాశ్వత సీఎంగా ఉండాలని రాయాలనుకుంటున్నడేమో. అంతర్జాతీయ ట్రక్కు స్పీడు 105 కి.మీలట. మన స్పీడ్ 45 కి.మీలట. ట్రక్కు స్పీడ్ పెంచడం కోసం రాజ్యాంగాన్ని మార్చాలట. రాజ్యాంగాన్ని ఎంత అవహేళన చేసిండో అర్ధమైతుంది. బీజేపీ ఎన్నడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. మతాలను, తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోంది నువ్వే. హిజాబ్ పై మాట్లాడొద్దని సుప్రీంకోర్టు (ప్రింట్ కాపీ ఇవ్వాలి) చెప్పింది. అయినా నువ్వు ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నవ్. బైంసాలో మత రాజకీయాలు చేసింది నువ్వు కాదా? బైంసాలో బాధితులను ఒక వర్గం చేతిలో దెబ్బతిన్న హిందూ యువకులపై పీడీ యాక్ట్ పెట్టింది నువ్వు కాదా? 2 వారాల పాటు వాళ్లను పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టించింది నువ్వు కాదా? మత సామరస్యం గురించి నువ్వా మాట్లాడేది? మేం ముస్లింలను కాపాడేందుకు ట్రిపుల్ తలాఖ్ తెచ్చినం. నువ్వు అనుకూలమా? కాదా? చెప్పాలి. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) 50 శాతం కర్నాటకలోకి వచ్చినయ్. చట్టం అందరికీ సమానమైతే అక్కడికే వస్తాయి. ఎక్కడైతే అవినీతి ఎక్కువుంటదో అక్కడికి పెట్టుబడులు రావు. నీ జీవితమంతా ప్రజలు కట్టే సొమ్మంతా నీ ఖాతాలో పడాలని చూస్తున్నవ్. కరోనా సొమ్ము.. ఆత్మ నిర్బర్ ద్వారా 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశ ప్రధాని ప్రకటించిండు. దీని ద్వారా తెలంగాణకు రైతు సమ్మాన్, స్వనిధి, పీఎఫ్ అమౌంట్, రుణాల మారిటోరియం పెంపువన్నీ ప్రజల అకౌంట్లో నేరుగా డబ్బులు పడినయ్. ఫ్రీ కరోనా వ్యాక్సిన్, ఉచిత బియ్యం వంటివన్నీ అమలు చేసిండు. ఇదంతా కేసీఆర్ కు పడతలేదు. అవన్నీ నా అకౌంట్లోనే పడాలని చూస్తుండు. అది కుదరకపోయే సరికి మోడీపై విమర్శలు చేస్తుండు’ అని మండిపడ్డారు బండి సంజయ్.