ఆప్ సర్కార్ పై బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా విరుచుకుపడ్డారు. బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. ఈ విషయంలో పోలీసు బలగాలను ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అహంకారానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తారని అన్నారు. ‘ ఈ రోజు బగ్గా తిరిగి ఇంటికి వచ్చా రు. ఇది ప్రజాస్వామ్య విజయం’ అని పేర్కొన్నారు.
ఈ విడుదల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చెంప పెట్టులాంటిదన్నారు. బగ్గాను అరెస్టు చేయడానికి పోలీసు బలగాలను కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
రైతులకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడం, కశ్మీరి పండిట్లకు క్షమాపణ చెప్పాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. అది నేరమే అయితే బీజేపీ నేతలు ఆ నేరాన్ని చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు.
బీజేపీ నేత తజిందర్ సింగ్ బగ్గాపై ఆప్ పార్టీ నేత సన్నీ సింగ్ అహ్లూవాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయన్ని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.