యూపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలన్నీ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ అనేక వ్యూహాలను పన్ని.. మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఓటర్లను ఆకర్షించేలా సంక్షేమంతో మేనిఫెస్టోను నింపేసింది. అయితే.. ఆదివారం దీన్ని విడుదల చేయాల్సి ఉండగా ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ మృతితో వాయిదా వేశారు బీజేపీ నేతలు.
లోక్ కల్యాణ్ సంకల్ప పాత్ర పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత మేనిఫెస్టోను విడుదల చేయించాలని ప్లానింగ్ జరిగింది. కానీ.. లతా మరణంతో అదికాస్తా వాయిదా పడింది. అమిత్ షా, యూపీ సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేపీ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ దేవ్ సింగ్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.
లతా మంగేష్కర్ లాంటి వారు వందల ఏళ్లకు ఒకసారి పుడతారని కొనియాడారు నేతలు. ఆమె మృతికి విచారం వ్యక్తం చేస్తూ.. బీజేపీ మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
ఈనెల 10 నుంచి ఏడు దశల్లో యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న కౌంటింగ్ ఉంటుంది. ఈసారి ఎలాగైనా గెలవాలని ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి.