నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బైపోల్ అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించాలో తెలియక ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంటే.. ఆశావహుల్లో ఒకరైన కంకణాల నివేదితా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానం అనుమతి లేకుండానే, అధికారిక ప్రకటన రాకముందే ఆమె తన నామినేషన్ దాఖలు చేసి చర్చనీయాంశమయ్యారు.
2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్‌లో బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదితా రెడ్డినే పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ పెద్దగా దూకుడుగా లేకపోవడంతో ఆమెకు కేవలం 2,675 ఓట్లను సంపాదించారు. నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. అయితే దుబ్బాక బైపోల్, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ భారీగా పుంజుకోవడంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టికెట్ ఇచ్చే విషయంపై ఆ పార్టీ నాయకత్వం ఎటూ తేల్చకోలేకపోతోంది.
కంకణాల నివేదితా రెడ్డితో పాటు డాక్టర్ రవి నాయక్, రిక్కల ఇంద్రసేనారెడ్డి, కడారి అంజయ్య యాదవ్ పేర్లు పరిశీలిస్తోంది. ఈ విషయం ఇంకా తేలకుండానే కంకణాల నివేదితా రెడ్డి ఏకంగా నామినేషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.