కేరళలో బలపడేందుకు బీజేపీ చేస్తున్న ఫీట్లు ఆశ్చర్యాన్ని కలిగిండమే కాదు.. నవ్వునూ తెప్పిస్తున్నాయి. వయసు మీదపడిందని ఎల్‌కే అద్వానీ లాంటి కీలక నేతలను నిర్మోహమాటంగా పక్కన బెట్టిన జాతీయ నాయకత్వం.. కేరళకు వచ్చేసరికి మాత్రం ఆ నిబంధనలను బ్రేక్ చేసింది. 88 ఏళ్ల మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దింపి.. దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది. కాగా ఇప్పుడు మరో విచిత్రమైన చర్యకు పూనుకుంది.
బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించిన బీజేపీ.. అభ్యర్థులకే తెలియకుండా వారి పేర్లను ప్రకటించింది. దీంతో విషయం తెలిసి వారు ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. వయానాడ్ జిల్లాలోని మనంతవాడి గిరిజన స్థానానికి పానియా తెగకు చెందిన 31 ఏళ్ల మణికుట్టన్ పేరును ప్రకటించింది బీజేపీ. అయితే అ యువకుడు టికెట్ ఇవ్వాలని అసలు కోరనే లేదు. అసలు అతనికి రాజకీయాలపై ఆసక్తినే లేదు. దీంతో జాబితాలో పేరును చూసి షాక్ అయ్యాడు. బీజేపీ టికెట్ ఇచ్చినప్పటికీ.. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని చెప్తున్నాడు.
పానియా తెగలో మొట్టమొదటి ఉన్నత విద్యావంతుడు మణి కుట్టన్‌నే కావడంతో.. తమకు కలిసి వస్తుందని బీజేపీ అడక్కుండానే టికెట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. కానీ వారు అడిగినా పోటీచేయబోనంటూ మణికుట్టన్ రివర్స్ షాక్ ఇస్తున్నాడు. ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవడమే తనకు ఇష్టమని స్పష్టం చేస్తున్నాడు ఆ యువకుడు.
కాగా, కేరళలో ఇప్పటిదాకా బీజేపీకి పెద్దగా ఉనికి లేదు. అక్కడ ఎప్పుడూ రెండు కూటములదే అధికారం. ఒకసారి ఎల్‌డీఎఫ్, మరోసారి యూడీఎఫ్ ఇలా అధికారంలోకి వస్తుంటాయి. ఇప్పుడు బీజేపీ కేరళలో పాగా వేయాలని ప్రయత్నం చేస్తోంది.