బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఆయన బరిలోకి దిగారు. అధిష్టానం నిర్ణయంతో లక్నో వెళ్లిన లక్ష్మణ్.. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.
యూపీ సీఎం యోగి దగ్గరుండి లక్ష్మణ్ చేత నామినేషన్ వేయించారు. జూన్ 10న 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. నలుగురు పేర్లతో రాజ్యసభ సోమవారం రాత్రి విడుదల చేసిన లిస్టులో లక్ష్మణ్ పేరు ఉంది.
ఎగువసభ స్థానానికి తెలంగాణ నుంచి లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వటం పట్ల పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా ఇతర నేతలు అభినందనలు తెలిపారు.
విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో కీలకంగా పని చేసిన లక్ష్మణ్.. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. హైదరాబాద్ నగర కార్యదర్శిగా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పీహెచ్‌డీ చేసిన లక్ష్మణ్ హిందీ, ఇంగ్లీషు భాషలలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.