2024 ఎన్నికలకు ముందు బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఐక్యం కావడానికి చేసే ప్రయత్నాలు ఫలించబోవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఇది అసలు సాధ్యమయ్యే పని కాదని, అన్ని పార్టీలను, లేదా అందరు లీడర్లను ఒక చోటికి చేర్చినంత మాత్రాన బీజేపీకి ఎదురునిలవ జాలరని ఆయన చెప్పారు. ఈ పార్టీని మీరు ఎదుర్కోవాలంటే దాని బలాన్ని, దాని హిందుత్వ సిధ్ధాంతాన్నీ, జాతీయవాదాన్ని మొదట అవగాహన చేసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ‘ఇది మూడంచెల ‘పిల్లర్’.. మీరు వీటిలో కనీసం రెండు పిల్లర్లనైనా దాటలేరు.. అసలు బీజేపీని సవాల్ చేయజాలరు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
.
హిందుత్వ ఐడియాలజీ పై పోరాటం చేయాలంటే గాంధేయవాదులను , అంబేద్కర్ అభిమానులను, సోషలిస్టులను, కమ్యూనిస్టులను ఎదుర్కోవలసి ఉంటుందని, కేవలం ఐడియాలజీ మీద గుడ్డి నమ్మకం ఉన్నంత మాత్రాన సరిపోదని ఆయన పేర్కొన్నారు. విపక్ష కూటమి అంటే ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారని, ఎవరు ఎవరితో లంచ్ చేస్తున్నారని, ఎవరు టీకి ఆహ్వానించారని వంటివన్నీ లెక్క లోకి వస్తున్నాయి.. కానీ ఐడియాలజీలన్నీ కలుస్తాయని నేననుకోను అని పీకే వ్యాఖ్యానించారు.
అసలు బీజేపీని ఓడిస్తారన్న ప్రసక్తే తలెత్తదు అని ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేబట్టిన భారత్ జోడోయాత్ర ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల ఫలితం ఉంటుందని తాను అనుకోనన్నారు.
తన సొంత సిధ్ధాంతం మహాత్మా గాంధీ ఐడియాలజీయేనని స్పష్టం చేసిన ఆయన.. బీహార్ రాష్ట్ర ప్రయోజనాలకు తాను ప్రాధాన్యతనిస్తానని, గాంధీజీ కాంగ్రెస్ సిధ్ధాంతాలను పునరుద్ధరించడానికే ‘జన సూరజ్ యాత్ర’ చేబట్టానని పీకే వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మహర్దశ పట్టాలన్నది తన లక్ష్యమైతే, ఎన్నికల్లో ఎలా గెలవాలా అన్నది వారి లక్ష్యమని ఆయన అన్నారు. నా ఆలోచనలను ఒకరకంగా అమలు చేయాలని వారు కోరుకుంటున్నా.. తన ఆలోచనలు వేరని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. బీహార్ లో తన నాలుగు నెలల యాత్ర ప్రజల ఆలోచనా దృక్పథాన్ని తెలుసుకోవడానికి ఉపకరించిందన్నారు.