కశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరించడం బీజేపీ వల్ల కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో జన్ ఆక్రోశ్ పేరిట ఓ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
1990 నాటి పరిస్థితులను కశ్మీరి పండిట్లు మళ్లీ ఇప్పుడు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గతంలో మాదిరిగానే కశ్మీరి పండిట్లకు భద్రత కల్పించడంలో ఇప్పటి కేంద్రం ప్రభుత్వం విఫలమైందన్నారు.
కశ్మీరి పండిట్ల హక్కులను హరిస్తున్నారని, కనీసం వారిని నిరసనలు కూడా తెలపనీయడం లేదని విమర్శించారు. దయచేసి కశ్మీరి పండిట్లపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని బీజేపీని కోరారు.
కశ్మీరి పండిట్లపై యాక్షన్ ప్లాన్ ను కేంద్ర ప్రకటించాలన్నారు. దాయాది దేశం పాక్ పైన ఆయన విరుచుకుపడ్డారు. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాక్ మద్దతుగా నిలుస్తోందని అన్నారు. పాక్ తన చీప్ ట్రిక్కులను ఆపాలని అన్నారు. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనన్నారు.