రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ అనేక వ్యాధుల బారిన పడిందని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రంలో పాత విధానాన్ని మార్చేందుకు తమ ప్రభుత్వం ‘శస్త్రచికిత్స’ను చేసిందని ఆయన తెలిపారు. అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో రూ. 1275 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు.
ఒక వ్యక్తి ఎలాగైతే వ్యాధిని నయం చేస్తామో అలాగే రాష్టానికి వచ్చిన అనేక వ్యాధులను నయం చేసేందుకు ఈ ‘ముక్తి యజ్ఞం’ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వాటిని నయం చేసేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
గుజరాత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరచడానికి,తమ ప్రభుత్వం వైద్యులు సూచించే ఔషధం, శస్త్రచికిత్స, సంరక్షణ అనే అంశాలను ఉపయోగించినట్టు చెప్పారు. ఇరవై ఐదేండ్ల క్రితం అనేక వ్యాధులతో గుజరాత్ బాధపడిందన్నారు.
ఆరోగ్య సంరక్షణలో వెనుకబాటు తనం, విద్యుత్ సౌకర్యాలు లేకపోవడం, నీటి కొరత, పేలవమైన శాంతి భద్రతలు వంటి అనేక వ్యాధులతో గుజరాత్ బాధపడిందన్నారు. ఈ వ్యాధులన్నింటికీ మూలకారణం ‘ఓటు బ్యాంకు రాజకీయం’ అని ఆయన వెల్లడించారు.
పాత వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చేందుకు శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు. నిష్క్రియాత్మకత, అలసత్వం, అవినీతికి కత్తెర వేయడమే తన శస్త్ర చికిత్స విధానమన్నారు. రాష్ట్రంలో కొత్త వ్యవస్థను తీసుకు వచ్చి మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడం, నూతన ఆస్పత్రులు ఏర్పాటు చేయడం వంటివి తాను ఇస్తున్న ఔషదాలని అన్నారు.