కేసీఆర్ పాలనలో నిజాం కాలం నాటి పరిస్థితులను చూస్తున్నామని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు సహా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాష్టీకాలను నిరసిస్తూ గద్వాల్ జిల్లా మల్దకలోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ముందుగా గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. ముఖానికి నల్ల మాస్క్ ధరించి టీఆర్ఎస్ దాష్టీకాలకు నిరసిస్తూ దీక్ష చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, కబ్జాలు, అత్యాచారాలు జరుగుతున్నయన్నారు. యాడ హత్య జరిగినా.. అత్యాచారాలు జరిగినా కారకులు టీఆర్ఎస్ వాళ్లే అవుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బాధ్యులైన ఒక్క టీఆర్ఎస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. దుర్మార్గపు, అరాచక పాలనకు నిదర్శనం ఇదేనంటూ ధ్వజమెత్తారు. “కేసీఆర్.. ఇప్పటికైనా దిగి రా.. ఈ దారుణాలపై సీబీఐ విచారణ జరిపించు. తప్పు చేసిన టీఆర్ఎస్ నాయకులను శిక్షించు” అని డిమాండ్ చేశారు. హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు చేస్తూ ప్రజలను అరిగోస పెడుతున్న టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మంలో సాయి గణేష్ మరణానికి కారకులైన స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు కఠిన శిక్ష పడేదాకా ఇటు ప్రజా క్షేత్రంలో, అటు న్యాయ పరంగా పోరాతామని స్పష్టం చేశారు.
“మంథనిలో లాయర్ వామన్ రావు హత్యకు టీఆర్ఎస్ వాళ్లే కారణం. ఖమ్మంలో సాయి గణేష్ పై 16 కేసులు పెట్టారు. అతను బతికుంటే ఈరోజు పెళ్లి చేసుకునేటోడు. యాత్రకు వచ్చేటోడు. పోలీసులు వేధించి సూసైడ్ చేసుకునేలా చేశారు. ఎవరైనా సరే.. మరణ వాంగ్మూలం ఇస్తే దాని ఆధారంగా కేసు నమోదు చేస్తారు. సాయి గణేష్ తన చావుకు టీఆర్ఎస్ వాళ్లు, పోలీసులే కారణమని చనిపోతూ చెప్పినా కేసు నమోదు చేయలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. స్థానిక మంత్రి అరాచకాలకు వ్యతిరేకంగా సాయి గణేష్ ఆశయాలను ముందుకు తీసుకెళతామని ఎంతోమంది యువకులు బీజేపీ చేస్తున్న ఉద్యమాల్లో స్వచ్చందంగా పాల్గొంటున్నారు” అని చెప్పారు బండి.
రామాయంపేటలో చిన్న వ్యాపారం చేసుకుంటున్న గంగం సంతోష్ ను అధికార పార్టీ మున్సిపల్ ఛైర్మన్ సహా టీఆర్ఎస్ నేతలు వేధించారని వివరించారు. “కోదాడలో కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తండ్రి లేని 20 ఏళ్ల పేదింటి యువతిపై టీఆర్ఎస్ నేతలు బలవంతంగా గుంజుకుపోయి మత్తు మందు ఇచ్చి రెండు రోజులు దారుణంగా ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్నా కనికరం లేకుండా వేధించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నేను టీఆర్ఎస్ వాడిని నన్నేం చేయలేరు. నోరు మూసుకుని పోండి. లేకుంటే చంపేస్తా అని బరితెగించి మాట్లాడిండంటే తెలంగాణలో ఏ పరిస్థితి నెలకొందో అర్ధం చేసుకోవాలి. జనగాంలో, వరంగల్ లో, హైదరాబాద్ లోనూ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాపానికి కేసులు పెట్టి వేధిస్తున్నారు” అని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తక్షణమే సీబీఐ విచారణ జరిపి దోషులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.