– హత్యలు, అత్యాచారాల అడ్డాగా తెలంగాణ
– జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార నిందితులకు స్టార్ హోటల్ ఆతిథ్యమా?
– 27 మంది విద్యార్థుల చావుకు కారణం ముమ్మాటీకి గ్లోబరీనా సంస్థే
– కేసులకు భయపడే ప్రసక్తే లేదు
– చట్ట, న్యాయ పోరాటాలు చేస్తాం..
– మేడ్చల్ సభలో బండి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాల్జేసి అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలకు అడ్డాగా తెలంగాణను మార్చారని పేర్కొన్నారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు ముమ్మాటికీ గ్లోబరీనా సంస్థే కారణమని ఉద్ఘాటించారు. కోర్టులంటే తమకు గౌరవముందని… టీఆర్ఎస్ నేతలు వేసే కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గ్లోబరీనా సంస్థ బండారాన్ని కోర్టుల ముందుంచి బయటపెడతామని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ 8 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా సేవ, గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని జవహార్ నగర్ లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు బండి సంజయ్ తోపాటు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సహా ఇతర నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా దోపిడీలకు అంతు లేకుండా పోతోందని మండిపడ్డారు బండి. భూములు కబ్జా చేస్తారు.. మార్కెట్ యార్డుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు కరపత్రాలతో ఇంటింటికీ వెళ్లి మోడీ దూతలుగా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. అవన్నీ కేసీఆర్ పథకాలుగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.
‘‘కేసీఆర్ నమ్మక ద్రోహి. పేదల రక్తాన్ని పీల్చుకుంటున్నడు. మోడీ పథకాలను కూడా టీఆర్ఎస్ పథకాలుగా ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. ప్రధాని అవాస్ యోజన కింద ఈ దేశంలో నిలువ నీడ లేని 3 కోట్ల మంది పేదలకు ఇండ్లు నిర్మించిన మహానుభావుడు మోడీ. కరెంట్ సౌకర్యమే లేని 18 వేల గ్రామాలకు వెలుగులు అందించారు. 9 కోట్ల మందికి ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత మోడీదే. 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్న ఘనత మోడీదే. స్వచ్ఛ భారత్ కింద 11 కోట్ల ఇండ్లకు టాయిలెట్లు నిర్మించారు. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు సహా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు వేల కోట్ల నిధులిస్తున్నారు’’ అని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు బండి. 8 ఏళ్ల మోడీ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. దమ్ముంటే 8 ఏళ్ల నీ నియంత పాలనపై కేసీఆర్ సిద్ధమా? అంటూ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రం, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా రెడీ అని స్పష్టం చేశారు సంజయ్. ‘‘ఆరోగ్యశ్రీ పడకేసింది. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనవల్ల అప్పులపాలైంది. శ్రీలంకలో ఇదే పరిస్థితి. కుటంబ పాలనతో అక్కడి ప్రజలు అడుక్కుతింటున్నరు. పేదల నడ్డివిరిచేలా అన్ని ఛార్జీలను పెంచారు. 3 ఏళ్లలో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచిండు.. కానీ ఆర్టీసీ కార్మికులకు 5 డీఏలు, 2 పీఆర్సీలు ఇవ్వలేదు. ఛార్జీలు పెంచి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి సీఎం కుట్ర చేస్తున్నడు. కరెంట్ ఛార్జీలు, ఇంటిపన్ను, నల్లా పన్నులు సహా అన్ని పన్నులు పెంచి రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటున్న సీఎం… ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలెందుకు చేసినవని అడిగితే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు బండి.
కేసీఆర్ 17 లక్షల రేషన్ కార్డులను తొలగించి పేదల ఉసురుపోసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే పెన్షన్లు తీసేశారని.. కొత్తవి ఇవ్వడం లేదని విమర్శించారు. ‘‘ప్రజలారా.. మీ ఎమ్మెల్యే వస్తే.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో.. రేషన్ కార్డులు ఎందుకు తొలగించారో.. ఇండ్లు ఎందుకు కట్టివ్వడం లేదో నిలదీయండి. తెలంగాణ సాధించుకున్నది కబ్జాలు, దోపిడీలు, అత్యాచారాల కోసమేనా.. వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రావడానికా? తెలంగాణ వచ్చినాక ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది? ఏనాడూ ఆత్మహత్యలు చేసుకోని ఆర్టీసీ ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలంగాణ వచ్చినంక ఆత్మహత్య చేసుకున్నరు. ఫాంహౌజ్ లో పండుకోవడానికా సీఎంను చేసింది. శ్రీకాంతాచారి, యాదిరెడ్డి సహా వందలాది మంది పేదలు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసమేనా తెలంగాణ సాధించుకుంది? తెల్లారిలేస్తే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నయ్. ఎక్కడ హత్య, అత్యాచారం జరిగినా ఎంఐఎం, టీఆర్ఎస్ హస్తం ఉంటోంది. హత్యలు, అత్యాచారాల కోసం రెండు పార్టీల నేతల పోటీ పడుతున్నరు. మంథని, ఖమ్మం, రామాయంపేట, నిర్మల్, కోదాడ, వనస్థలిపురం సహా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అత్యాచారాలు జరిగినా ఈ రెండు పార్టీల భాగస్వామ్యమే ఉంది’’ అని విమర్శలు గుప్పించారు.
జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం అనుకోకుండా జరిగింది కానేకాదన్న బండి… పథకం ప్రకారం… కసితో అత్యాచారం చేశారన్నారు. 28న ఘటన జరిగితే బీజేపీ కార్యకర్తలు స్టేషన్ ను ముట్టడించే వరకు కేసు పెట్టలేదన్నారు. నిందితులకు సిగ్గు లేకుండా స్టార్ హోటళ్లలో బిర్యానీలు పెడుతున్నారని.. కోవిడ్ సమయంలోనూ పేదలు, ఒక వర్గం పట్ల ఇదే వివక్ష చూపారని విమర్శించారు. తెలంగాణలో హిందూ సమాజానికి బీజేపీ అండగా లేకపోతే వారి పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలన్నారు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్న ఎంఐఎం నాయకులకు టీఆర్ఎస్ నేతలు, సీఎం దాసోహమయ్యారని ఆరోపించారు. ‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఇంతకీ వాళ్లు చేసిన తప్పేమిటి? వాళ్లేమైనా టెర్రరిస్టులా? అర్ధరాత్రి ఇండ్లల్లొకి చొరబడి రక్తం చిందేలా పోలీసులతో కొట్టిస్తారా? మిడ్ మానేరు బాధితులకు పరిహారం ఇవ్వరు.. గౌరవెల్లి బాధితులపై లాఠీ ఛార్జ్ చేస్తారా? వాళ్లకు ఆర్ అండ్ ఆర్ కింద అందాల్సిన పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల న్యాయమైన డిమాండ్ తీర్చకుండా ట్రయల్ రన్ చేస్తారట. నిర్వాసితులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో ఇండ్లల్లో నిద్రపోతున్న గ్రామస్థులపై పోలీసులు దాడి చేయడం ఏంటి? బలవంతంగా వందల మందిని అక్రమంగా అరెస్టు చేశారు. ఇలాంటి నీచపు, నియంత పాలనను తరిమితరిమి కొడదాం. అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు. ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి. పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు బండి సంజయ్.