బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పై గరంగరం అయ్యారు. తనను చూసి ఎందుకు భయపడుతున్నారని గులాబీ నేతలపై ద్వజమెత్తారు. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని ఖండిస్తూ.. తనపై చేస్తున్న దుష్ప్రచారంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్. బీజేపీ ఎదుగుదలపై వాళ్లకు ఎందుకంత అక్కసు అని సూటిగా ప్రశ్నించారు.
అధికార పార్టీ నాయకుల లాగా ఇసుక దందా, భూదందా, రియల్ ఎస్టేట్, మాదకద్రవ్యాల మాఫియా, సినిమా తారల సెక్స్ రాకెట్, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియాలను తాము నడిపించడం లేదన్నారు. ఇలాంటి ఎజెండాతో ‘బండి సంజయ్’ నడవడని… ఇలాంటి వాటికోసం పీఏలను పెట్టుకొని వసూళ్లకు పాల్పడడం తాము చేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు అధికారపార్టీకి ‘మల్లెపూల’ దండలు వేసి దండం పెట్టే ప్రతిపక్షం వారే ఉండేవాళ్ళన్న ఆయన… ఇప్పుడు సరైన మొగోడు బరిగీసి, గిరిగీసి నిలబడేసరికి బెంబేలెత్తుతున్నారని ఫైరయ్యారు.
అధికార పార్టీ ఎంగిలి మెతుకులు తినే చిల్లరగాళ్లు తనపై బురద చల్లడం సూర్యుడిపై ఉమ్మి వేస్తే ఏమౌతుందో అదే జరుగుతుందని తెలిపారు. పూటకో కథనం అల్లుతూ ఏదోరకంగా ‘ఢీఫేమ్’ చేయాలనుకోవడం కొత్తేం కాదని.. కరీంనగర్ గడ్డపై కషాయం జెండా ఎగరేసి నిలబడ్డ నిజాయితీపరుడినని చెప్పారు. తాను నియంతృత్వ పాలనపై తిరగబడ్డ ధీరుడ్ని, మతోన్మాదంపై మర్లబడ్డ యోధుడ్ని అంటూ వివరించారు.
Advertisements
తనను సావు దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారని.. ఒక జాతీయ పార్టీ నాయకుడు ఎవరిని కలిసినా పైసలే ఇస్తారా? అది 20 ఏళ్ల నుండి “వసూల్ రాజా” సారుకు అలవాటేమో ఒక షర్టు ప్యాంటుతో యుద్ధ మైదానంలో నిలబడ్డ తనకు లేదు అంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు బండి సంజయ్.