బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
స్వాతంత్ర్య పోరాటంలోని స్వదేశీ ఉద్యమం స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోడీ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు. కనీసం ప్రధాని పేరును కూడా కేసీఆర్ ప్రస్తావించకపోవడం సిగ్గుచేటు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించని కేసీఆర్… హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ దెబ్బకు బయపడి గడీల నుండి దిగొచ్చి మహనీయుల ఫొటోలకు దండలేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కేసీఆర్ తన కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలనే తపనతోనే కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల పేరును కూడా స్మరించడం లేదు. కమీషన్లు దండుకోవాలనే లక్ష్యంతోనే సచివాలయ పనులను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్ కు… చేనేత దినోత్సవం నాడు స్ఫూర్తి దాయకంగా వ్యవహరించి చేనేత కుటుంబాల్లో వెలుగులు తీసుకురావాలనే కనీస స్ప్రహ లేకపోవడం బాధాకరం. పద్మశాలీల్లో చైతన్యం చాలా ఎక్కువ. ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిన కేసీఆర్ కనబడితే తరిమికొడతారనే భయంతోనే జాతీయ చేనేత దినోత్సవానికి రావడం లేదు.
బీసీ వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రధాని మోడీకి చేతి వృత్తి గురించి బాగా తెలుసు. మోడీ పేదరికం నుండి వచ్చిన వ్యక్తి. నేతన్నల కష్ట నష్టాలు తెలుసు. కాబట్టే వాళ్లను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు తెచ్చారు. కేబినెట్ లో పెద్ద ఎత్తున బీసీలకు అవకాశం కల్పించారు. వైద్య విద్యా సంస్థల్లో 27 శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోడీదే.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయని ఓట్లు దండుకున్నారు కేసీఆర్. కానీ.. ఆయన పాలనలోనే దాదాపు 500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడ చూసినా ఆకలి చావులు, ఆత్మహత్యలే. అయినా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదు. చేనేత కార్మికులు బాధపడొద్దు. బీజేపీ మీకు అండగా ఉంటుంది. కేసీఆర్ మెడలు వంచైనా మీ సమస్యలు పరిష్కరిస్తాం. కేంద్రంతో మాట్లాడి నేతన్నల కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసేలా కృషి చేస్తాం.
దళిత బంధు మాదిరిగానే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట చేనేత బంధు పథకాన్ని ప్రారంభించాలి. బీజేపీ అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. చేనేత కార్మికులు కేసీఆర్ మాయ మాటలు నమ్మి మోసపోకండి. నమ్మించి నట్టేట ముంచే రకం ఆయన. తూతూ మంత్రపు హామీలకు మోసపోతే ఐదేళ్లు నష్టపోతాం. బీసీలు అధికారంలోకి రాకూడదన్నదే కేసీఆర్ ఆలోచన. వాళ్లు చదువుకోకుండా గేదెలు, గొర్రెలు కాయాలనే ఉద్దేశంతోనే వాటిని ఇస్తూ మభ్యపెడుతున్నారు. పేదలు, బీసీల పట్ల రాష్ట్ర పభుత్వం చేస్తున్న మోసాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. అప్పుడే బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం సాధ్యం. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చేనేత సమస్యలు పరిష్కరించుకుందాం.