టీఆరెస్ సర్కార్ పై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. టీఆరెస్ మనకు కరెంట్ కట్ చేశారు…. ఈసారి వాళ్ల పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలకు భయపడతమా? పళ్లు పటపట కొరికితే ఉంటరా? ఢిల్లీకి పోయి వంగి వంగి దండాలు పెట్టి వచ్చిన కేసీఆర్ పోయి ఫాంహౌజ్ ల పడుకున్నడు. కేసీఆర్ ఢిల్లీలోకానీ, ఇక్కడ కానీ పీకేదేమీ లేదు. జోగిపేట తెలంగాణ అడ్డా. నిజాం నిరంకుశ పాలనపై యుద్దం చేసిన గడ్డ. పవిత్రమైన జోగినాథ్ ఆలయం కొలువైన స్థలం. ఆ స్వామి ఆశీస్సులతో టీఆర్ఎస్ ను ఓడిద్దాం అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఎక్కడికి పోయాయ్… ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా కనీసం పరామర్శించని వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమైన నేతలు ప్రతిరోజు తమ కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేస్తారు. కానీ ఈ సీఎం కేసీఆర్ కు మాత్రం షెడ్యూల్ ఉండదు. ఫాంహౌజ్, ప్రగతిభవన్ కే పరిమితం అన్నారు. కొడుకు ముఖ్యమంత్రి విషయంలో వాళ్లింట్లో టీవీలు పగులుతున్నయ్. టీవీ షోరూంలకు మస్త్ డిమాండ్ వచ్చిందట అంటూ సెటైర్స్ వేశారు.
ఈ రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించే పార్టీ బీజేపీ మాత్రమే అన్న బండి సంజయ్… కేసీఆర్ గడీలను బద్దలు కొట్టే పార్టీ బీజేపీయే అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని, అవినీతి పాలనను చరమగీతం పాడతమని, కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేస్తున్నా… ఎప్పుడైనా బీజేపీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసిందా? కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు అని గుర్తు చేశారు.
కేసీఆర్ సీఎం కాబట్టి ఏ సీఎం వెళ్లినా మోడీ కలుస్తారని, మోడి రోజుకు 18 గంటలు పనిచేస్తే కేసీఆర్ మాత్రం 18 గంటలు పడుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికలొస్తున్నయనగానే ఢిల్లీకి పోయే కేసీఆర్… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మేయర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసిండన్నారు. కానీ తిరస్కరించిన అమిత్ షా 2023లో అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ తప్ప తూట్ పాలిష్ పదవులకు మాకు అవసరం లేదని కరాఖండిగా చెప్పారన్నారు.
జోగిపేటలో రోడ్లు ఇంత దరిద్రంగా ఉంటాయా? ఇక్కడికి రావడానికి ఇన్ని గంటలు పడుతుందా? అన్నీ గతకులు, గుంతలు, రాళ్లు తేలినయ్. దేశంలో చెత్త రోడ్లకు అవార్డులిస్తే.. ఫస్ట్ అవార్డు టీఆర్ఎస్ కే, జోగిపేట్ కే ఇవ్వాలన్నారు. కేంద్రం తెలంగాణకు 2.91 లక్షల ఇండ్లు ఇస్తే కేసీఆర్ కట్టింది 12 వేలు మాత్రమే. జోగిపేటలో 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే 400 మాత్రమే కట్టింది. ఆందోల్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం 334.42 కోట్ల నిధులచ్చిందన్నారు. ఆందోల్ మున్సిపాలిటీ 9 కోట్ల 40 లక్షలు, మున్సిపాలిటీలో ఇండ్ల నిర్మాణం కోసం 20 కోట్ల 18 లక్షలు, తెలంగాణలో ఎస్సీల సంక్షేమం కోసం సబ్ ప్లాన్ కింద 245 కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఎస్సీల హక్కుల రక్షణ కోసం 100 కోట్లు వచ్చాయన్నారు.
అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు రాని ఏకైక సీఎం కేసీఆర్ అని, దళితులకు 3 ఎకరాలిస్తానని మోసం చేశారన్నారు. అవినీతి పేరుతో దళితులను కేబినెట్ నుండి పక్కన పెట్టారన్నారు. అంబేద్కర్ పుట్టిన స్థలాన్ని, స్వర్గస్తులైన స్థలాలను, చదువుకున్న స్థలాలను గుర్తించి బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ స్పూర్తి కేంద్రాలను నిర్మించిన ఘనత నరేంద్రమోదీదే అన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీ విత్తనాలు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి హామీ లేఏమీ ఇవ్వలేదు. రోడ్ల కోసం, ఫ్యాక్టరీలు, ప్రాజెక్టుల కోసం తమ భూమినిస్తే తగిన న్యాయం చేయకుండా కేసీఆర్ మోసం చేసిండని జనం బాధపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీలకు కేసీఆర్ ఏం చేసిండో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుస్తారనే భయంతో దళిత బంధు పేరుతో దళిత సమాజాన్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇప్పటికీ జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. రోజుకో జిల్లాకు వాయిదాల పద్దతిన జీతాలిస్తున్న కేసీఆర్… దళిత బంధు ఎట్లా ఇస్తడో అర్ధం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలపై ఒక్కొక్కరికి లక్షకుపైగా అప్పు ఉందని, ధనిక రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిండని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర స్పందన చూశాక విదేశాలకు పోయి కేసీఆర్ డబ్బు దాచుకుంటున్నడని విమర్శించారు. తెలంగాణ అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ కుటుంబం ఒక్కటే పాలన చేస్తోందని, శ్రీకాంత చారి, సుమన్, పోలీస్ కిష్టయ్య సహా అనేక మంది తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తే వారి త్యాగాలు వృధా అయ్యాయన్నారు. ఆ కుటుంబాలు ప్రశ్నిస్తున్నయ్… అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్…. తెలంగాణ తల్లి రోదిస్తోంది. రండి…బీజేపీ కార్యకర్తల్లారా…ఈ మూర్ఖుడి చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి రోదిస్తోంది. కేసీఆర్ గడీలను బద్దలు కొట్టి కేసీఆర్ కుటుంబానికి పొలిమేర దాటించేలా తరమికొట్టాలని అడుగుతోందని బండి సంజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు.
రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలే కాదు…చిన్న పిల్లలు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పసిపిల్లల ఉసురు కేసీఆర్ తగులుతుంది. కేటీఆర్ సంస్థ నిర్వాకం వల్ల విద్యార్థులు చనిపోయిండన్నారు. పేదోళ్లు చనిపోతే కనీసం పరామర్శించని కేసీఆర్ పెద్దోళ్లు చనిపోతే మాత్రం బోకెలు తీసుకెళ్లి సంతాపం చెబుతారన్నారు. ఈ జోగిపేట హిందుత్వ అడ్డా… ఇక్కడి నుండి 50పైగా కరసేవలో పాల్గొన్న చరిత్ర జోగిపేటది. కరసేవకుల త్యాగాల స్ఫూర్తితో రామమందిరాన్ని నిర్మిస్తున్న నేత నరేంద్రమోడిది అన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నామాన్ని, లాఠీదెబ్బలు తింటూ జైళ్లకు పోతున్నామన్నారు. మా లక్ష్యం ఒక్కటే…. 2023లో గొల్లకొండపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే మా లక్ష్యం అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.