– వడ్ల కొనుగోలు వెనుక టీఆర్ఎస్ డ్రామా
– కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపును దారి మళ్లించేందుకే!
– గత కొనుగోళ్లలో పెద్దఎత్తున గోల్ మాల్
– అక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు
– సీఎంకు దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధమా?
– చేతనైతే వడ్లు కొనాలి.. లేదంటే తప్పుకోవాలి
– సింగరేణి ప్రైవేటీకరణ పచ్చి అబద్దం
– కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై మోయం లేని భారం పడుతోందని… ఆ అంశాన్ని దారి మళ్లించేందుకు కేసీఆర్ ధాన్యం కొనుగోలు పేరుతో కొత్త డ్రామాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ప్రమేయం ఉందన్నారు. సీఎంకు నిజంగా దమ్ముంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు.
పెట్రోట్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్.. వ్యాట్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోల్ పై రూ.30లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే ఆ మేరకు తగ్గించి లీటర్ పెట్రోల్ రూ.80కే అందించాలని సూచించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు, సీట్లు కొనడం సీఎంకు అలవాటైందని.. ఇతర రాష్ట్రాలకు డబ్బుల మూటలను పంపుతున్నారని ఆరోపించారు. ఓట్లు, సీట్లు కొంటున్న సీఎం… రైతుల కోసం వడ్లు ఎందుకు కొనడం లేదో చెప్పాలన్నారు.
అబద్దాల్లో కేసీఆర్ నెంబర్ వన్… అబద్దాలు చెప్పి చెప్పి… చివరకు నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సెటైర్లు వేశారు. కేసీఆర్ సమస్య పరిష్కారం కావాలా? కొట్లాట కావాలో తేల్చుకోవాలన్నారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులకు, సీఎంకు సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదని.. వడ్లను కొనుగోలు చేయలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తప్పు చేసినట్లు గ్రహించారని… ప్రజలు తరిమికొడతారనే భయంతో తన తప్పును కేంద్రంపై నెట్టి బీజేపీని బద్నాం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఫైరయ్యారు.
Advertisements
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. సింగరేణిలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఆ సంస్థను ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు బండి. ఇదంతా పచ్చి అబద్ధమని, త్వరలో సింగరేణి ఎన్నికలు రాబోతున్నందునే కేసీఆర్ బీజేపీని బద్నాం చేసేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.