– కౌలు రైతులకు రైతు బంధు లేదు
– ఇంటింటికీ నీళ్లు రావుగానీ.. ఊరికో 10 బెల్ట్ షాపులు
– టీఆర్ఎస్ జెండా పట్టినోళ్లకు, ఉన్నోళ్లకే దళిత బంధు
– టీఆర్ఎస్ అరాచకాలు ఇంకెన్నాళ్లు భరిద్దాం..
– కేసీఆర్ ను గల్లాపట్టి నిలదీద్దాం..
– 28వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో బండి
కరోనా వచ్చిన దగ్గర నుండి రెండేళ్లుగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పేదలకు 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తానని చెప్పిందని.. ఈ లెక్కన ఒక్కో పేద వ్యక్తికి నెలకు 11 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలని… కానీ కేసీఆర్ కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని అమ్ముకుంటూ పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నారని విమర్శించారు. వ్యవసాయం చేసి నష్టపోతున్న పేద, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వని కేసీఆర్ వందల ఎకరాల భూములున్న అసాములకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు టీఆర్ఎస్ అరాచకాలను భరిద్దాం.. ఇదేం న్యాయమని మీరంతా కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను నిలదీయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28వ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలోని పాటిగడ గేట్, కోతపేట, సంతాపూర్ గ్రామాల్లో మధ్యాహ్నం వరకు పాదయాత్ర చేశారు. ఆయా గ్రామాల ప్రజలు బండి సంజయ్ కు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపించి, బాణా సంచా పేల్చి, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపేట గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ కు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. తమ ఊరికి రోజుల తరబడి నీళ్లు రావడం లేదని, పావులా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదని, ఇండ్లు ఇవ్వడం లేదని, పెన్షన్లు లేవని వాపోయారు. ఆయా సమస్యలన్నీ సావధానంగా విన్న బండి వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికీ ఫిల్టర్ నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ మాటలన్నీ అబద్దాలేనన్నారు బండి. కొత్తపేటలో వారానికి, నెలకోసారి నీళ్లు వస్తున్నాయని.. నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం చేతకాదు కానీ.. ఊరికి 10 బెల్టుషాపులు పెట్టి తాగండి-ఊగండి అని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. ఇంటింటికీ పేపర్ వేసినట్లుగా.. క్వార్టర్ బాటిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఫైరయ్యారు. ప్రగతి భవన్ లో వందల కోట్లు ఖర్చు పెట్టి 100 రూములు కట్టుకున్న కేసీఆర్.. పేదలకు మాత్రం ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు 1.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే వాటిని కూడా కట్టివ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం చేతగాని కేసీఆర్.. తన ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలిచ్చుకుని నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. దళితుల 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశారు.. పైగా పేదోళ్ల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. “పేదల భూముల్లోనే సబ్ స్టేషన్లు, కార్యాలయాలు కడతామని ఇబ్బంది పెడుతున్నరు. పేదలకు పట్టా, అసైన్డ్ భూములున్నా ధరణిలోకి ఎక్కనియ్యకుండా వేధిస్తున్నరు. టీఆర్ఎస్ జెండా మోసేటోడికి, ధనవంతులకే దళిత బంధు ఇస్తున్నరు. వందల ఎకరాల అసామికి రైతు బంధు ఇస్తున్న కేసీఆర్.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు. పేద రైతులను పట్టించుకోకుండా ధనవంతులకు, వందల ఎకరాల అసాములకు రైతు బంధు ఇవ్వడమేంటి. దీనిపై కేసీఆర్ ను అందరూ నిలదీయండి. గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డ్ సహా అన్ని అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోంది. కానీ.. వాటిపై మాత్రం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల ఫొటోలు పెట్టుకోవడం సిగ్గు చేటు. అందుకే ఈ దుర్మార్గపు కేసీఆర్ పాలన పోవాలి. పేదలకు న్యాయం జరగాలి. ఇప్పటి వరకు మీరంతా అన్ని పార్టీలకూ అవకాశమిచ్చారు. టీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారమిచ్చారు. ఇంకెన్నాళ్లు వాళ్ల అరాచకాలు భరిద్దాం? ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి. బీజేపీకి అధికారంలోకి వస్తే పేదల కోసం పనిచేస్తాం.. మేం సేవ చేస్తేనే మళ్లీ అధికారం ఇవ్వండి.. లేకుండా ఓటేయకండి” అని ప్రజలను కోరారు బండి సంజయ్.