తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రూ. 100 కోట్లు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని ఎమ్మెల్యేలకు చెబుతున్నారని ఆరోపించారు. అందుకోసం ప్రభుత్వ భూములని కబ్జా చేసుకోవాలని కేసీఆర్ వారికి సూచిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే కేసీఆర్ వద్దకు వెళ్తే బాగుగోలు అడిగిన అనంతరం.. ఈ మాటను చెప్పారట అని బండి వివరించారు.
13 వ రోజు పాదయాత్రలో.. ఆందోల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న బండి..టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ.. మజ్లిస్ పార్టీ తాలిబన్ పార్టీ అని అభివర్ణించారు. ఎస్సీ నియోజకవర్గమైన ఆందోల్‌లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో… ఇద్దరు, ముగ్గురికి ఇండ్లిస్తానని ఆ తరువాత పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు. ఆందోల్‌లో దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దళిత బంధు రావాలంటే ఉప ఎన్నిక రావాల్సిందేనని… ఈ మాట తాను చెప్పడం లేదని, ప్రజలే అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ధ్యాసంతా బార్, బీర్ మీదే తప్ప జనం మీద లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 6.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేశారని చెప్పిన బండి సంజయ్.. ప్రజలు చచ్చిపోతున్నా, రైతులు నష్టోపోతున్నా పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లి పడుకున్నారని మండిడపడ్డారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నా చేసేదేం ఉండదని విమర్శించారు. పేదోడికి కోవిడ్ వస్తే ఆస్పత్రికి కావాల్సిన డాక్టర్లు ఉండరు కానీ.. కేసీఆర్‌కు ఫాంహౌస్‌లో కుక్కకి సుస్తీ అయినా అంబులెన్సులు వెళతాయని ఆరోపించారు. కుక్కకు ఉన్న విలువ.. పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
”ఎన్నికలొస్తే కోతలు కోస్తడు.. ఊకదంపుడు ఉపన్యాసాలిస్తడు.. కానీ చేసేదేమీ ఉండదు.. దళితులకు 3 ఎకరాలన్నడు.. ఎంతమందికి ఇచ్చిండు? ఇంటికో ఉద్యోగమిస్తనన్నడు.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తనన్నడు. కానీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంటేనే దళితులను వంచించే పార్టీ. దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్ధం కావడం లేదు. ఉద్యోగస్తులకు జీతాల్లేవు. జీతాలే ఇవ్వలేని సీఎం దళిత బంధు ఇస్తాడా? ప్రగతి భవన్ లో 100 కోట్లతో రూములు కట్టుకున్నడే తప్ప అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు” అని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు బండి
సెప్టెంబర్ 17న నిర్మల్‌లో అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రావాలని కోరారు బండి సంజయ్. కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా ఎంఐఎం నేతలకు భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడానికి కేసీఆర్ వెనుకాడుతున్నారని ఆరోపించారు.
కేంద్రo ప్రభుత్వం తెలంగాణకు రూ. వేల కోట్లు ఇస్తోందన్నారు బండి. బియ్యం, లైట్లు, రోడ్లు, చెట్లు, కమ్యూనిటీ హాళ్లు, నీళ్లు, టాయిలెట్ సహా చివరకు బియ్యం పైసలు కూడా కేంద్రానివేనని చెప్పారు బండి. ఉచితంగా వ్యాక్సిన్లు కూడా ఇచ్చేది కేంద్రమేనని అన్నారు. కానీ ఫొటోలు మాత్రం కేసీఆర్‌వి పెట్టుకుంటున్నారని ఆరోపించారు. వైకుంఠ ధామాలకు రూ.11.13 లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ.4.23 లక్షలు, డంప్ యార్డ్ కు రూ. 2.50 లక్షలు, నర్సరీకి 1.56 లక్షలు, రైతు వేదికలకు రూ. 10 లక్షలు, స్వనిధి కింద యువకులకు రూ.10 వేలు ఇస్తోంది కేంద్రమేనని చెప్పారు బండి.
తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని, హిందూ ధర్మాన్ని, దేవుళ్లను, సమాజాన్నీ చీల్చే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు బండి. తాను నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్….వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోకుండా యువకులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. మండపాలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఆంక్షల మధ్య హిందువులు పండుగలు నిర్వహించుకోవాలా అని మండిపడ్డారు. తనను మతతత్వవాది అన్నా సరే…80 శాతం హిందువుల కోసం బరాబర్ మాట్లాడతానని స్పష్టం చేశారు బండి. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తెలుసుకుని భరోసా నింపేందుకు.. వారి సమస్యలను 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు బండి సంజయ్.