సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. మలి దశ ఉద్యమంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పర్వదినమైన తెలంగాణ విమోచన కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ.. ప్రస్తుతం పాలిస్తున్న టీఆర్ఎస్ దీన్ని పట్టించుకోకపోవడంతో తెలంగాణ ప్రజల గుండెలు గాయపడుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లేఖలో కోరారు బండి సంజయ్.
మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు నిర్వహించరని కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఊరూ వాడా ప్రచారం చేశారనన్నారు బండి. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు దాటింది. మరి.. ఇన్నేళ్లలో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించాలనే సోయే లేదా అని ప్రశ్నించారు. రజాకార్లు, కాసీం, రజ్వీ వారసులైన మజ్లిస్ పార్టీ నేతలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి కేసీఆర్ ఎక్కడా ప్రస్తావన కూడా చేయడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోయినా.. బీజేపీ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి వాడవాడలా జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుతోందని గుర్తు చేశారు బండి. ఈ సెప్టెంబర్ 17న నిర్మల్ లో వెయ్యి ఊడలమర్రి దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని… దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్.
Letter to Chief Minister (12.09.2021)
బండి సంజయ్ లేఖలో ప్రస్తావించిన డిమాండ్లు
– సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం… అధికారికంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి.
– తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి, కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయంతో వాటి నిర్మాణం చేపట్టాలి.
– తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన 2022 నాటికి పూర్తి చేయాలి.
– తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి.
– తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది ఉద్యమంలో పాల్గొన్న వారిని సత్కరించాలి.
– రజాకార్లను తరిమికొట్టిన వీరబైరాన్ పల్లి, వరంగల్ కోట, రేణికుంట, కడవెండి, కామారెడ్డిగూడెం, బీబీనగర్ సహా పలు ప్రాంతాలతో పాటు ఇతర ఉద్యమ ఘట్టాలను పరిరక్షించాలి.
Letter to Chief Minister (12.09.2021)