బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న 2018 ఆగస్టు 28న మృతి చెంది అప్పుడే మూడేళ్లయింది. వారు భౌతికంగా దూరమైనా దేశ ఔన్నత్యాన్ని చాటాలన్న వారి ఆశయాలు, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యాలు, వారి ఆలోచనలు, నిరుపమాన సేవలు, అసమాన త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి మార్గదర్శనం సదా మమ్మల్ని నడిపిస్తుంది. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అటల్ బిహారీ వాజపేయి దేశ అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఒక్క బిజెపిలోనే సాధ్యం అని నిరూపించారు.
ఆనాడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ ప్రస్థానం నేటి ప్రస్తుత సంకీర్ణ యుగంలోనూ సొంతంగా మెజారిటీ సాధించిందంటే… ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే దానికి వారు వేసిన పటిష్ట పునాదులే కారణం.
1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. పదవుల కన్నా విలువలకు పట్టం కట్టిన వాజ్ పేయి.. భారత అత్యున్నత పదవి అయిన ప్రధానమంత్రి పదవిని నైతిక విలువల కోసం తృణప్రాయంగా త్యజించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. అటల్ బిహారీ వాజపేయి ప్రసంగాలకు ప్రజలే కాకుండా ప్రతిపక్షనేతలు సైతం ముగ్ధులయ్యే వారు.మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వాజపేయి స్వర్ణ చతుర్భుజితో జాతీయ రహదారులను విస్తరించారు. 2001లో ఆయన ప్రతిపాదించిన రహదారుల విధానాన్నే ఆ తర్వాతి ప్రభుత్వాలూ కొనసాగిస్తున్నాయి. గ్రామాల్లో నేడు రహదారుల సౌకర్యం ఏర్పడిందంటే దానికి కారణం వారే. అమెరికా ఉపగ్రహ నిఘాకు చిక్కకుండా పోఖ్రాన్ లో అణపరీక్షలు నిర్వహించి భారత సత్తా చాటిన ఘనత వారికే దక్కుతుంది. ‘అంధకారం మాయవుతుంది… సూర్యుడు ఉదయిస్తాడు.. కమలం వికసిస్తుంది’ అన్న వారి నినాదం ప్రతి బిజెపి కార్యకర్త గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది.