– ఇంటికో ఉద్యోగం ఏది?
– జాబ్ క్యాలెండర్ ఏది?
– కేసీఆర్ ను నిలదీసిన బండి
– ఎన్నాళ్లీ మోసం.. పేదల ప్రభుత్వాన్ని తీసుకొస్తాం
– నీళ్లు, నిధులు, నియామకాలు బీజేపీతోనే సాధ్యం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని పేదలందరూ కోరుకుంటున్నారని చెప్పారు బండి సంజయ్. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ ఫుల్ గా జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మవారి కరుణ, కటాక్షం కలిగించించే అవకాశం కల్పించిన స్వర్గీయ పీజేఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో రాజకీయాలు ఏం మాట్లాడాల్సి వచ్చినా పీజేఆర్ లేకుండా మాట్లాడలేమన్నారు. అంతగా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 31 రోజులపాటు 383 కిలోమీటర్లు సాగిందని తెలిపారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర కొనసాగించామని అన్నారు బండి. ముగింపు సభకు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అమిత్ షా రాకతో ప్రతీ కార్యకర్తలో జోష్ పెరిగిందని చెప్పారు. షా సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టు లాంటిదన్నారు. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లో ఒక స్పష్టత వచ్చిందని.. ఉచిత విద్య, వైద్యం అనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజల నుంచి పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని.. వారి కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేశానన్నారు.
చాలా పేదరికంతో ఎంతోమంది గుడిసెల్లో జీవిస్తున్నారన్న సంజయ్.. లక్షల మందికి ఇండ్లు కూడా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడలేని అర్హులైన పేదలందరికీ ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం హామీ అటకెక్కిందని.. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తాం.. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఏం చేశారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాట్ తోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామన్నారు. అలాగే ఫసల్ భీమా యోజన అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ సీఎం ఫాంహౌస్ లో వ్యవసాయం చేస్తూ.. కోటీశ్వరుడు అవుతుంటే రైతులు మాత్రం ఆయన నిర్ణయాలతో బికారులు అవుతున్నారని విమర్శించారు బండి. కేసీఆర్ రైతులను అరిగోస పెడుతున్నారని.. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకుంటామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని తెలిపారు. తమ ప్రభుత్వం వస్తే.. బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పారు. 4శాతం ఉన్న మైనారిటీ రిజర్వేషన్లు తీసేసి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ పగటి వేషగాళ్ళన్న సంజయ్.. గంగిరెద్దులను ఆడించే వారికి విశ్వాసం ఉంటుంది కానీ వాళ్లకు అది కూడా ఉండదని మండిపడ్డారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో ఆకుపచ్చ జెండాలను ఎగరనివ్వమని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. ఆకుపచ్చని తెలంగాణనే బీజేపీ లక్ష్యమన్న బండి.. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలి గానీ.. శృతి మించడం మంచిది కాదన్నారు.