– టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే
– సీట్ల పంపకాలు కూడా అయ్యాయి
– పీకే బ్రేక్ ఫాస్ట్ ఏఐసీసీ భవన్ లో..
– లంచ్ ప్రగతి భవన్ లో..
– పైగా.. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనంటూ తప్పుడు ప్రచారం
– ఇకపై కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆటలు సాగవు
– మక్తల్ సభలో బండి ఫైర్
కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని.. కలిసి పోటీ చేస్తాయని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మక్తల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసిందని.. కానీ, బీజేపీ ఏనాడు కూడా గులాబీ పార్టీతో కలవలేదని గుర్తు చేశారు. ఒకప్పుడు 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న తమ పార్టీ ఇప్పుడు 3వందలకు పైగా సాధించిందని.. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని తెలిపారు.
పీకే విషయంలో కేసీఆర్ ను ముందే హెచ్చరించానన్నారు బండి. పీకేతో గీకించుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు. ఇప్పుడు అతను కాంగ్రెస్ పంచన చేరుతున్నాడని.. అయినా.. కాంగ్రెస్ లో ఎవడూ గెలవరు.. గెలిచినా అందులో ఉండరు.. అందరూ టీఆర్ఎస్ లో చేరతారంటూ గత విషయాల్ని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలు కలిసే.. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ అయితే.. ఎవరైనా ఎమ్మెల్యే, మంత్రి పార్టీ వీడుతున్నారని తెలియగానే మీటింగ్ పెట్టి బీజేపీ మనం ఒకటేనని చెబుతున్నారని.. దీంతో వారంతా వెనక్కి తగ్గుతున్నారని చెప్పారు.
పీకే.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఢిల్లీ ఏఐసీసీ భవన్ లో చేసి.. లంచ్ హైదరాబాద్ ప్రగతి భవన్ లో చేస్తున్నాడని ఎద్దేవ చేశారు సంజయ్. మక్తల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తామన్నారు. ఇక్కడ వేరే జెండాకు స్థానం లేదని దాన్ని నిరూపించేందుకే పెద్దఎత్తున జనం తరలివచ్చారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందన్న బండి.. తప్పకుండా బీజేపీ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉఫ్ అని ఊదితే పోయే పార్టీ టీఆర్ఎస్ అని.. తమ ప్రభుత్వం వచ్చాక మక్తల్ మున్సిపాలిటీని అద్దంలా మెరిసేలా చేస్తామన్నారు.
బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని.. ధర్మం కోసం తాను ఎక్కడైనా మాట్లాడతానని స్పష్టం చేశారు బండి. భారతీయుడిగా పుట్టడాన్ని గర్వంగా ఫీలవుతానని.. హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని చెప్పారు. రంజాన్ వస్తే.. ముస్లిం సోదరులు అని శుభాకాంక్షలు చెప్పే నేతలు.. దసరా వస్తే హిందూ బంధువులకు శుభాకాంక్షలు అని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కోటలను బద్దలు కొట్టేది బీజేపీ మాత్రమేనని.. రాష్ట్రంలో ప్రతీ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయడమే లక్ష్యమన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు బండి సంజయ్.