ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ను ప్రధాని మోడీ ప్రతిపాదించగా.. పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర కోలాహలం నెలకొంది. ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. బాణాసంచా కాల్చి, గిరిజన నృత్యాలు చేశారు.
ఈ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. గిరిజన నేతలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు బండి. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ, నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు.
జులై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు సంజయ్. మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను, ఎస్సీ వర్గానికి చెంది కోవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనన్న ఆయన.. ఈసారి ఎస్టీ వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేయబోతున్నారన్నారు.
ద్రౌపది ముర్ము ఎంపిక దేశవ్యాప్తంగా ఎస్టీ సామాజివర్గానికి దక్కిన గుర్తింపుగా అభివవర్ణించారు బండి. అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా మోడీ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజ్యాంగ నిర్మాత సైతం సంతోషిస్తారని చెప్పారు.