తీవ్రవాదం వల్ల కాశ్మీర్ ఎలా అయితే నష్టపోయిందో.. ఎంఐఎం వల్ల పాతబస్తీ అంతగా నష్టపోయిందన్నారు బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన బండి టీఆర్‌ఎస్, ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. ఒవైసీకి భయపడి పాతబస్తీకి మంజూరైన మెట్రో రైలు మార్గాన్ని కేసీఆర్ ఆపేశారని ఆరోపించారు. పాతబస్తీ రోహింగ్యాలు, తీవ్రవాదులకు అడ్డాగా మారి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఈ నియంత కేసీఆర్ పాలనలో పాతబస్తీతోపాటు తెలంగాణ ప్రజలు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు బండి. ఆర్టీసీ ఛార్జీల పెంపు, కరెంట్ ఛార్జీల పెంపు సహా అనేక రకాల పన్నులతో మోయలేని భారం మోస్తున్నారని ఫైరయ్యారు. కుటుంబ-నియంత-అవినీతి పాలన సాగిస్తూ మోయలేని పన్నుల భారాన్ని మోపుతున్న ప్రజలకు ఈ నూతన సంవత్సరంలో కష్టాలు తొలిగిపోవాలని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
రైతులు, యువత, కార్మికులు, మహిళలతోపాటు రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు కోరుకున్న ‘ప్రజాస్వామిక తెలంగాణ’ నిర్మాణం దిశగా శుభకృత్ నామ సంవత్సరంలో బీజేపీ చేపట్టే పోరాటాలకు అండగా నిలవాలని కోరారు సంజయ్. గతేడాది కరోనా, యుద్ధం, తీవ్రవాదం అనే మూడు అంశాలు మనతోపాటు ప్రపంచ ప్రజలందరినీ తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. కరోనాతో గత రెండేళ్లుగా చిగురుటాకులా వణికిపోయిన ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని.. దేశంలో ప్రధాని మోడీ తీసుకున్న చర్యలు అమోఘమని కొనియాడారు. ఆత్మనిర్భర భారత్ తో దేశాన్ని ఆదుకున్నారని.. ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్ అందించారని చెప్పారు.
భారత్ ను విశ్వగురుగా చేసేందుకు మోడీ నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు బండి. మోడీ కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అండగా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రెండు దేశాల ప్రజలకే పరిమితం కాలేదన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వివరించారు. ఉక్రెయిన్ నుండి రావాల్సిన సన్ ఫ్లవర్ నూనె ఆగిపోవడంతో ప్రజలు రెట్టింపు ధరలకు కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని వివరించారు.
ఇక శ్రీలంకలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఆ దేశం తీవ్రమైన ఆర్దిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు బండి. ప్రజలు ఆకలికి అలమటిస్తున్నారని… తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నారని తెలిపారు. అంతులేని ఆకలి చావులు సంభవిస్తుండటం అందరినీ కలిచివేస్తోందన్నారు. అందుకే తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. ఎందుకంటే తీవ్రవాదం పేదలకు అత్యంత నష్టదాయకమని… కొందరు కుహనా మేధావులు తీవ్రవాదాన్ని రెండు రాజకీయ పార్టీల మధ్య పోరుగానో… రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధంగానో… రెండు సిద్దాంతాల మధ్య వైరుధ్యంగానో చిత్రీకరిస్తున్నారని.. అది ముమ్మాటికీ తప్పని చెప్పారు. అందుకే వాటన్నింటికీ తారక మంత్రం ‘శాంతి’ మాత్రమేనని తెలిపారు. శాంతితోనే అభివృద్ధి సాధ్యమని… ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ ఆ మార్గమే అనుసరణీయమని చెప్పారు. తీవ్రవాదంతో ఏ పార్టీ కూడా రాజీ పడొద్దన్న ఆయన… ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్ధించే పార్టీలన్నీ తన దృష్టిలో దేశద్రోహ పార్టీలేనని అన్నారు. పాతబస్తీలోని రోహింగ్యాల రూపంలో తీవ్రవాదం ఉన్నా.. 15 నిమిషాలు టైమిస్తే నరికి చంపుతామన్న ఒవైసీ రూపంలో ఉన్నా.. వారి పార్టీని చంకన పెట్టుకుని ఊరేగుతున్న టీఆర్ఎస్ రూపంలో ఉన్నా… అట్లాంటి వాళ్లంతా దేశద్రోహులేనని స్పష్టం చేశారు. అలాంటి వాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలిపారు.
ఇక ఉగాది పండుగ విశిష్టత గురించి మాట్లాడుతూ.. ఉగాది మనిషి జీవితంలోని చీకటి వెలుగుల సంగమానికి సంకేతమన్నారు. ప్రకృతికీ, మనిషి జీవితానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని పండగల రూపంలో చూపెట్టిన మహోన్నత ధర్మం.. భారతీయ హిందూ సనాతన ధర్మమని తెలిపారు. హిందూ ధర్మం ఎప్పుడూ ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతితోనే మమేకమవుతూ మనిషి ఉన్నత జీవితానికి మార్గం చూపిందని వివరించారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం హిందూ సనానత ధర్మానికి మాత్రమే ఉందన్నారు. ప్రపంచ దేశాలు ప్రకృతి శక్తిని గుర్తించని రోజుల్లోనే సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధించడం ప్రారంభించిందని వివరించారు బండి సంజయ్.