– ఏకగ్రీవం కోసం నడ్డా, రాజ్ నాథ్ ప్రయత్నాలు
– విపక్షాలతో చర్చలకు బీజేపీ కసరత్తు
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ .. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ నెల 15న సమావేశం కానున్నాయి. వాటిని ఏకం చేసేందుకు మమత 15మంది కీలక నేతలకు లేఖలు పంపారు. దీంతో బీజేపీ రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా స్కెచ్ వేసింది. విపక్షాలతో ఈ విషయంపై చర్చించేందుకు పావులు కదుపుతోంది.
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా అధికార ఎన్డీఏలోని భాగస్వామ్యపక్షాలు, విపక్ష పార్టీలతో నడ్డా, రాజ్ నాథ్ చర్చలు జరపనున్నారు.
ప్రస్తుతం జేడీయూ, అప్నాదళ్, అన్నాడీఎంకే, ఎల్జేపీ, జేజేపీ, ఈశాన్య రాష్ట్ర పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్పీఫ్, ఏజీపీ పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. స్వతంత్రంగా ఉంటున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతోనూ నడ్డా, రాజ్నాథ్ సంప్రదింపులు జరపనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీతో ముగియనుంది. రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది నామినేట్ చేసినట్లయితే.. కొత్త అధ్యక్షుడి కోసం జూలై 18న ఓటింగ్ నిర్వహించి, జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఈ ఎన్నికల్లో 4,809 మంది ఓటర్లు ఉండగా, వారిలో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నారు. వీరిలో 223 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.