కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాహుల్ అన్నారని, తద్వారా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా, యూరప్ లాంటి దేశాలను ఆయన రెచ్చగొడుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని రాహుల్ పై ఆయన మండిపడ్డారు. ప్రజా స్వామ్య హద్దులన్నింటినీ రాహుల్ గాంధీ అతిక్రమించారని ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీజేవైఎం ఆధ్వర్వంలో చెన్నైలో నిర్వహించిన ‘నేషనల్ యూత్ పార్లమెంట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ మానసికంగా దివాళా తీసిందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నిస్సిగ్గుగా దేశాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను రాహుల్ ఆహ్వానిస్తున్నారంటూ ఆరోపించారు.
దేశ రాజకీయ సంస్కృతిని ప్రధాని మోడీ సమూలంగా మార్చేశారని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో మోడీ తీసుకు వచ్చిన మార్పులను దేశంలోని నలుమూలలకూ యువత తీసుకు వెళ్లి ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా ఉన్న యువతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.