కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరచూ నిరసనలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ధరల పెంపు విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. కానీ.. శుక్రవారం చేసిన నిరసన కార్యక్రమాలు రెండు పార్టీల మధ్య కొత్త పంచాయితీకి దారితీశాయి. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర నేతలు నల్ల దుస్తులు ధరించి ధర్నా చేశారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా మీడియాలో హైలెట్ అయింది.
అయితే.. కేంద్రమంత్రి అమిత్ షా ఓ కొత్త అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడూ ధర్నాలు చేస్తారు గానీ.. ఆగస్టు 5వ తేదీనే నిరసన తెలపడం.. అది కూడా నల్లదుస్తులు ధరించి మరీ చేయడానికి అసలు కారణం వేరే ఉందన్నారు. ఆగస్టు 5న ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. దానికి వ్యతిరేకం అనే చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ నిరసన చేపట్టిందని షా విమర్శించారు. ‘‘కాంగ్రెస్ ఎందుకు ప్రత్యేకంగా నిరసన చేపట్టింది? ప్రధాని మోడీ ఇదే రోజు అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేశారు. దీనికి వ్యతిరేకం అని చెప్పేందుకు, బుజ్జగింపు రాజకీయాలు చేసేందుకే ఈ నిరసన చేపట్టింది. దీని ద్వారా వాళ్లు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు’’ అంటూ ప్రశ్నించారు హోంమంత్రి.
షా ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దీనిపై జైరాం రమేష్ స్పందిస్తూ..‘‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ప్రజాస్వామ్య నిరసనలను దారి మళ్లించడానికే ఇదంతా. ప్రజల దృష్టి మరల్చేందుకే రాముడు అంశం తెరపైకి తెచ్చారు హోంమంత్రి. ఇటువంటి బూటకపు వాదనలను పుట్టించడంలో మీకు మీరే సాటి.’’ అంటూ మండిపడ్డారు.
అమిత్ షా వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ కూడా స్పందించారు. దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలపై ద్రవ్యోల్బణం భారం పడకుండా పోరాడడమే రాముడు చూపిన మార్గమని సెటైర్ వేశారు. ‘‘ధరలు పెంచి బలహీనులను బాధపెట్టేవాడు శ్రీరామునిపై దాడి చేస్తాడు. దానికి వ్యతిరేకంగా ఉద్యమించే వారితో తప్పుడు మాటలు మాట్లాడేవాడు లోక్ నాయక్ రామ్ ని, భారత ప్రజలను అవమానిస్తాడు’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ అంశం చుట్టూ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. యూపీ సీఎం యోగి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.