కమలానాధులు విశాఖపై కన్నేశారు. గ్రేటర్ విశాఖలో పాగా వేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. నేతలు తప్పితే కార్యకర్తలు లేని బీజేపీని క్షేత్రస్థాయిలో బలమైన శక్తిగా తయారు చేసేందుకు స్కెచ్ వేసింది. ఇందుకు పలువురు నేతలను టార్గెట్ చేసి పార్టీలోకి తెచ్చుకోవడమే కాకుండా, సామాజికవర్గాల సమీకరణల ఆధారంగా వేట మొదలుపెట్టింది. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న మహా విశాఖపట్నం అంటే రాజకీయ పార్టీలకు హాట్ సీట్. ఈ జిల్లాలో పాగా వేస్తే చాలు రాజకీయంగా, రాజ్యాధికారానికి దగ్గరైనట్లుగానే అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటుంటాయి. అందుకే ప్రధాన పార్టీల అధినేతలు తమకు అత్యంత సన్నిహతమైన నేతలనే ఇక్కడ ఇన్ చార్జీలుగా పెట్టుకుంటుంటారు. ప్రస్తుతం వైసీపీలో జగన్ కు అత్యంత సన్నహితింగా ఉండే ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ బాధ్యతలను చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నికలకు ముందు వరకు చంద్రబాబుకు కోజ్ అసొసియేట్ నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఉండేవారు. అలగే జనసేన పవన్ కూడా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఇప్పుడు బీజేపీకి కూడా విశాఖ వ్యవహారాలను చక్కబెట్టే నేత అవసరం పడింది.
విశాఖ జిల్లాలో పట్టు సంపాదించాలంటే సామాజికవర్గాల సమీకరణ తప్పనిసరనేది రాజకీయ పార్టీల ఫార్ములా. కాపు, వెలమ, రెడ్డి,యాదవ, గవర సామాజికవర్గాలదే ఇక్కడ రాజకీయ ఆధిపత్యం. అన్ని పార్టీల్లోనూ, చివరకు కమ్యూనిస్టు పార్టీల్లో కూడా ఈ వర్గాలదే అగ్రతాంబూలం. కానీ విశాఖ బీజేపీలో మాత్రం భిన్నమైన సామాజికవర్గ నాయకత్వం ఉంది. ఇప్పటి వరకు చాలా మంది బ్రాహ్మణ, వైశ్య, కమ్మ నేతల ప్రాతనిధ్యమే ఎక్కువగా ఉంది. వాళ్లు కూడా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ అప్పుడప్పుడూ పార్టీలో తళుక్కున మెరిసే వారే ఎక్కువ. జిల్లాలో ఈ సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ మిగిలిన వారితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం అత్యంత బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను పార్టీలోకి దించాలని ప్లాన్ వేసింది. ఓటు బ్యాంక్ అధికంగా ఉండి.. పార్టీలో ఏ సామాజికవర్గానికి పెద్దగా ప్రాతినిధ్యం లేదో గుర్తించి వారందరికీ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళ్లాలనేది కమలనాథుల ఆలోచన. దీనికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పలువురు నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తెచ్చుకునే టార్గెట్ ను పెట్టుకుంది.
గతంలో విశాఖ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి వల్ల పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం లేదని 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ నిర్థారణకు వచ్చింది. విశాఖ ఎంపీగా ఉన్న కంభంపాటి హరిబాబు టీడీపీతో పొత్తు పెట్టుకోగానే పొలిటికల్ స్రీన్ మీద కనబడకుండా పోయారు. ఇక బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజుకు నియోజకవర్గంలో మంచి పేరే ఉన్నప్పటికీ గంటాని ఎదుర్కొని ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇక టీడీపీ పుణ్యమా అని ఉత్తరాంధ్ర పట్టబధ్రుల నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్సీ మాధవ్ కు రాజకీయ పటిమ లేదన్నది సొంత పార్టీ నేతల టాక్. పోనీ ప్రజాకర్షక శక్తి ఉందా అంటే అదీ లేదు. ఇలాంటి వారందరినీ నమ్ముకుని విశాఖలో ఎన్నికలకు వెళితే జరగబోయేదేంటో కమలనాథులు ముందే గ్రహించారు. అందుకే విశాఖ వీధుల్లో బీజీపీ జెండాను ఎగురవేసే నేతల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
టీడీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక క్రాస్ రోడ్స్ లో నిల్చున్న గంటా శ్రీనివాసరావుని కమలదళం గుర్తించింది. బీజేపీ కాపు నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు రంగంలోకి దిగి గంటాని అధిష్టానంతో టచ్ లోకి పంపి మంతనాలు దిగ్విజయంగా ముగిసేలా వ్యవహారాన్ని చక్కబెట్టారు. ఇటీవలే విశాఖలో కూడా సోము వీర్రాజు, గంటా బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్ ను సైతం రక్తికట్టించి రాజకీయాలను రాష్ట్రవ్యాప్తంగా రాజేసారు. గంటా అంటే కాస్తో కూస్తో ప్రజాకర్షణ నేతగా గుర్తింపు ఉంది. ఆలాగే సామాజికవర్గం వారీగా చూసుకుంటే కాపు కులం తరుఫున ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్నా నేతగా బీజేపీ భావిస్తోంది. పైగా గంటా కు ఒక్క విశాఖలోనే కాకుండా అటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలను కూడా టచ్ లోకి తీసుకునే శక్తి ఉంది. అంతే కాదు కాపు సామాజికవర్గానికి చెందిన రాజకీయ నేతగా గంటాకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతో పాటుగా మిగిలిన పార్టీల్లో కూడా అందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో గంటా వస్తే కాపు సామాజికవర్గాన్ని సెట్ చేసినట్లేనన్నది బీజేపీ నేతల మనసులో మాట.