తిరుపతి పార్లమెంట్ స్థానంలో ఉప ఎన్నిక అభ్యర్థిపై ఎట్టకేలకు బీజేపీ, జనసేన ఓ అంగీకారానికి వచ్చాయి. బీజేపీ తరపు అభ్యర్థినే పోటీలో నిలబడతారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపామని.. ఆయన అందుకు ఒప్పుకున్నట్టుగా తెలిపారు. ఈమేరకు ఆయన్ను కలిసిన ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు సోము వీర్రాజు.
ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ప్రకటన చేసినప్పటికీ.. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తొలుత బీజేపీ సొంత నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థినే పోటీ చేస్తారని సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించడం ఆ మధ్య రెండు పార్టీల మధ్య కొంత విబేధాలు పొడచూపాయి. తమను సంప్రదించకుండా ప్రకటన చేయడమేంటని జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో నాటి నుంచి తిరుపతి స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది సస్పెన్స్‌గానే ఉండిపోయింది. తాజాగా ఆ వివాదానికి, సస్పెన్స్‌కు తెరదించుతూ.. తమ పార్టీ అభ్యర్థినే పోటీ చేస్తాడంటూ బీజేపీ ప్రకటించింది.