– ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు
– మళ్లీ అధికారంలోకి వస్తామంటున్న సంజయ్ రౌత్
ఉద్ధవ్ రాజీనామా తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సుప్రీం ఆదేశాల ప్రకారం ఇవాళ బలపరీక్ష జరగాల్సి ఉండగా.. ఠాక్రే రాజీనామా చేయడంతో దానిని రద్దు చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ రాజేంద్ర భగవత్ ప్రకటన విడుదల చేశారు.
గవర్నర్ ఆదేశాల ప్రకారం బలపరీక్షను రద్దు చేసినట్లు ఎమ్మెల్యేలకు తెలియజేశారు భగవత్. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఫడ్నవీస్ ఇంటికి బీజేపీ నేతలు చేరుకున్నారు. సమావేశం తర్వాత ఫడ్నవీస్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే ఛాన్స్ ఉంది. ఇటు గోవాలోని షిండే క్యాంపుతో ఫడ్నవీస్ ఎప్పటికప్పుడు ఫోన్ లో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలుపుతారని సమాచారం.
ఇక ఉద్ధవ్ నైతిక విలువలతో పనిచేశారని అన్నారు సంజయ్ రౌత్. శివసేన అధికారం కోసం పుట్టలేదని.. సొంత బలంతో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.