బడికి, గుడికి, జనావాసాల మధ్య మద్యం దుకాణాలను పెట్టకూడదని నిబంధనలు ఉన్నా.. వాటిని బేఖాతరు చేస్తున్నారు వైన్ షాపుల యజమానులు. నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూసాపేట్ లోని మున్సిపల్ ఆఫీస్ కు దగ్గరలో భవానీ వైన్స్ పేరిట మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికులతో పాటు స్కూల్ చిన్నారులు సైతం ఇక్కడి నుండి షాప్ తొలగించాలని కోరుతూ.. గాంధేయమార్గంలో పూలు ఇచ్చి మరీ నిరసన తెలిపారు.
అయినా వైన్స్ యాజమాన్యం తీరు మార్చుకోలేదు. అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతుండడంతో.. వెంటనే వైన్ షాప్ లు తొలగించాలని డిమాండ్ చేస్తూ మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేందర్ భవానీ వైన్స్ షాప్ ఎదుట రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇదివరకే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షకు విద్యార్థులు సంఘీభావం తెలిపారు. అయితే దీక్షకు దిగిన మహేందర్ ను కూకట్ పల్లి పోలీసులు స్టేషన్ కు తరలించారు. పోలీసుల అత్యుత్సాహంపై మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమపని తాము చేయకుండా శాంతియుతంగా దీక్ష చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ ను స్టేషన్ కు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు.