హైదరాబాద్ జలమండలి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీలో నీటి సమస్య, నిధుల అంశంపై కంప్లయింట్ ఇచ్చేందుకు బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు కార్పొరేటర్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం నడిచింది.
వాటర్ బోర్డు ఎండీ దాన కిశోర్ ను కలిసే తీరతామని స్పష్టం చేశారు కార్పొరేటర్లు. చివరకు ఐదుగురిని మాత్రమే ఆఫీస్ లోకి అనుమతించారు పోలీసులు. ఎండీ అందుబాటులో లేకపోవడంతో మరో అధికారిని కలిసి మెమోరాండం ఇచ్చారు. వాటర్ బోర్డుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
బస్తీలు, కాలనీల్లో ఐదు రోజులకోసారు నీళ్లు వస్తున్నాయన్నారు బీజేపీ కార్పొరేటర్లు. నగరంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కొద్ది రోజుల క్రితం సర్వసభ్య సమావేశం జరపడం లేదని బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగగా.. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జలమండలి దగ్గర ముందుగానే పోలీసులు భారీగా మోహరించారు.