ఫ్లెక్సీల కారణంగా రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరి అత్యుత్సాహం, మరొకరి అనాలోచితం కారణంగా ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకోవడం నిత్యం వార్తల్లో చూస్తునే ఉంటాం. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో కూడా ఫ్లెక్సీ కారణంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది.
హుజురాబాద్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల సరుకుల పెంచిన ధరలను నిరసిస్తూ ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను దగ్ధం చేస్తున్నారు. అది గమనించిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు చేరుకుని దగ్ధం చేస్తున్న నరేంద్ర మోడీ ఫ్లెక్సీని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఫ్లెక్సీలను తీసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.