– ప్రకాశ్ రాజ్ కు రాజ్యసభ!
– కేసీఆర్ ఫిక్స్ అయినట్లు ప్రచారం!
– తుక్డే గ్యాంగ్ తో ప్రయాణం దేనికి సంకేతం!
– కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు
బీజేపీ వ్యతిరేక జట్టుకు కెప్టెన్ కావాలని తహతహలాడుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీనికోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకూడదని డిసైడ్ అయ్యారు. బీజేపీ పేరెత్తితేనే కస్సుమని లేచే నాయకులందరినీ ఓ తాటిపైకి తేవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే శరద్ పవార్, ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు. అయితే.. ఈ టూర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు నటుడు ప్రకాశ్ రాజ్. కేసీఆర్ వెంట ఆయన ఉండడానికి గల కారణాలేంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజీనామా చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఎన్నిక జరగనుంది. ఆ పదవీకాలం మరో మూడేళ్లు ఉంది. బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీ చేసిన సమయంలో ఆ స్థానాన్ని కవితకు ఇస్తారన్న ప్రచారం జరిగినా.. అది అవ్వలేదు. ఇప్పుడు దాన్ని ప్రకాశ్ రాజ్‌కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. దీని ద్వారా ప్రకాశ్ రాజ్ సేవలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ గట్టిగా ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ తరఫున బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టి.. సమన్వయం చేసే బాధ్యతలను ఆయనకే ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కర్నాటక, తమిళనాడులోని బీజేపీ వ్యతిరేకులతో ప్రకాశ్ రాజ్ కు పరిచయాలున్నాయి. అలాగే మోడీ పేరెత్తిత్తేనే మండిపడే కొందరు విద్యార్థి నాయకులతోనూ మంచి ర్యాపో ఉంది. ఎలాగైనా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రకాశ్ రాజ్ ఎప్పటినుంచో చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా ఓటర్లు పట్టించుకోలేదు. డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే.. కేసీఆర్ ద్వారా రాజ్యసభకు వెళ్లి మోడీ సర్కార్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే.. సినిమాలలో బాగా రాణించినా ప్రజా జీవనంలో ఆయన చెప్పుకోదగిన ప్రభావం చూపలేకపోవడం కేసీఆర్ కు ఉపయోగం ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు దేశ విచ్ఛిన్నకర శక్తులకు ప్రకాశ్ రాజ్ మద్దతు పలికారని.. అలాంటి వ్యక్తితో కలిసి కేసీఆర్ పయనించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి బీజేపీ వర్గాలు. జిగ్నేశ్, ఖలీద్ వంటి వారితో కలిసి ప్రకాశ్ రాజ్ దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దేశాన్ని ఏలాలని తుక్డే గ్యాంగ్ కలలు కంటోందని.. వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని అంటున్నాయి. దేశ ఐక్యత, సైనిక శక్తిని అనుమానించిన కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, మసూద్ అజర్ వంటి వారికి మద్దతిచ్చిన ప్రకాశ్ రాజ్ తో కేసీఆర్ కలిసి పయనించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నాయి.
ఇటు తెలుగులో ఎంతోమంది అగ్ర నటులు ఉండగా.. పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తినే అందలం ఎక్కించాలా అనే ప్రశ్న కూడా తెరపైకి తెస్తున్నాయి బీజేపీ వర్గాలు. ఇప్పటికే తెలంగాణ ద్రోహులకు ప్రయారిటీ ఇస్తూ.. ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు కేసీఆర్ పై ఉన్నాయి. అదీగాక.. పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి విమర్శల పాలయ్యారని.. ఇప్పుడు వేరే రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజ్ ను అందలం ఎక్కించేందుకు చూస్తున్నారని మండిపడుతున్నాయి.