సర్జికల్ స్ట్రయిక్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం భారత ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా సీఎం మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల సమయంలో సరిహద్దుల్లో అలజడులు రేగుతున్నాయని కేసీఆర్ ప్రకటించడం శత్రు దేశాల వాదనకు బలం చేకూర్చడమే అవుతుందని చెప్పారు.
భారత ఆర్మీ ఛీఫ్, వాయుసేన ఛీఫ్ సర్జికల్ స్ట్రయిక్ పై ప్రకటన విడుదల చేశాక ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు డీకే అరుణ. కానీ.. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి పాకిస్థాన్ మంత్రి అడిగినట్లుగా సాక్షాధారాలు అడగడం కేసీఆర్ దిగజారుడు రాజకీయమని మండిపడ్డారు. కాంగ్రెస్ తో పొత్తుకోసం, జాతీయ స్థాయిలో చిన్న స్థానం కోసం రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మద్దతుగా ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా మాట్లాడడం టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ థర్డ్ క్లాస్ మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.
బిపిన్ రావత్ పై కపట ప్రేమ చూపెడుతున్న కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు ఆయన్ను అసభ్యంగా దూషించినప్పుడు ఎందుకు ప్రగతి భవన్ లో నిశ్శబ్దంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ‘రాజకీయాల కోసం గ్లోబల్స్ ప్రచారాలు చేస్తున్న కేసీఆర్ కళ్ళకు బిపిన్ రావత్ పార్థివ దేహన్ని తమిళనాడు నుండి తరలిస్తుండగా తమిళ ప్రజలు జాతీయ జెండాను చేతపట్టుకుని రహదారుల వెంట నివాళులు అర్పించిన సంగతి కనిపించలేదా? జాతీయ జెండా నీకు బీజేపీ జెండాలా కనిపిస్తుందా? కొత్త రాజకీయ పార్టీ పెట్టుకో, లేకుంటే కొత్త ఫ్రంటో, టెంటో పెట్టుకో.. కానీ దేశ భద్రతను తాకట్టుపెట్టేలా, పాకిస్థాన్ ప్రకటనలకు బలం చేకూర్చేలా, భారత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేలా ఇంకోసారి మాట్లాడితే నీకు తగిన శాస్తి చేస్తాం’ అని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న బీజేపీని చూసి తట్టుకోలేక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చలేక కేసీఆర్ రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు డీకే అరుణ. రాజ్యాంగం గురించి, భారత సైన్యం గురించి ఇష్టారీతిన మాట్లాడడం ఆయన పతనానికి నాందని అన్నారు. పిచ్చి ప్రేలాపనలతో, బీజేపీ కార్యకర్తలపై దాడులతో అధికారాన్ని కాపాడుకుందామని కేసీఆర్ భావించడం అవివేకమే అవుతుందని దుయ్యబట్టారు డీకే అరుణ.