తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి సొమ్ముతో రాష్ట్రాల్లో గెలవాలని పగటి కలలు కంటున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలు వినే ఓపిక లేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సచివాలయానికి వెళ్లని సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు వినతి పత్రం ఇస్తే.. దాన్ని వాళ్ల ముఖంపై పడేయడం సీఎం అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారని డీకే అరుణ గుర్తు చేశారు.
కాగా తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని కాలం గడిపిన కేసీఆర్.. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మరో డ్రామాకు సిద్దమయ్యారన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించినట్లే.. దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్, వీఆర్ఎస్ అవుతుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
కాగా దసరా పండుగ శుభదినాన తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ మేరకు కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఈ తీర్మానంపై సంతకం చేశారు. 8 రాష్ట్రాలకు చెందిన నేతలు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.