టీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్రం ముప్పేట దాడి చేస్తోంది. అవకాశం దొరికిన చోటల్లా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. తాజాగా సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కంటిన్యూ చేసేందుకు చేసిన తీర్మానానికి కేంద్రం నో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పైగా సీఎండీ కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించడం సింగరేణి చరిత్రలోనే ఫస్ట్ టైం అని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్‌పై బీజేపీ సీరియస్‌గా దాడికి సిద్దమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సీఎండీ శ్రీధర్ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అలాగే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహణలో కావాలనే జాప్యం చేస్తూ, టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. సింగరేణికి సంబంధించిన ఫండ్స్‌ను రాష్ట్ర ఖజానాలోకి మళ్లించడంతో పాటుగా కంపెనీలో డీజిల్, ఓబీ కుంభకోణాలు, ఇతర అవినీతి, అక్రమాలు బయటపడుతున్నా.. శ్రీధర్ పట్టించుకోవడం లేదని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయట. ముఖ్యంగా సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే శ్రీధర్‌ని కచ్చితంగా తప్పించాల్సిందేనని.. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం కేంద్రం దృష్టికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం.. శ్రీధర్ కొనసాగింపుపై విముఖత వ్యక్తం చేసిందని అంటున్నారు.