కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ.. ఆంధ్రలో కేడర్ ను నిలబెట్టుకోడానికి నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఈ సమస్య పార్టీని వెంటాడుతోంది. దేశంలో అత్యధిక కేడర్ ఉన్న పార్టీగా రికార్డులు కేక్కింది బిజేపి జిల్లాలో మాత్రం ఇబ్బందులు పడుతోంది. అసలు బీజేపీకి జిల్లా స్థాయిలో ఉన్న మార్కులు చూస్తే.. కార్యకర్తలే కనిపించని పరిస్థితి.
వాయిస్ ఓవర్: భారతీయ జనతా పార్టీ. వరుసగా రెండు సార్లు అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన పార్టీ. 125 ఏళ్ల కాంగ్రెస్ కు చుక్కలు చూపించి.. కేడర్ లేకుండా చేసింది. కేంద్రంలో తన బలమేంటో చూపించాల్సి వస్తే.. రెండు ఎన్నికల్ని ఉదాహరణగా చూపిస్తుంది. మెల్లమెల్లగా దేశం మొత్తం తన హవా చూపించాలని భావిస్తోంది ఆ పార్టీ. కానీ.. విజయనగరం జిల్లాలో మాత్రం ఇప్పటికీ పార్టీ పరిస్థితి జీరోగానే ఉందనేది వాస్తవం. ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలే ఇది ఒప్పుకుంటున్నారు. ఇందుకు అక్షరాలా తమ పార్టీ నేతలే కారణమంటూ మోహమాటం లేకుండా చెబుతారు. రాష్ట్రం అంతా ఒకలా వుంటే తమ జిల్లాలో మాత్రం మరోలా వుందని తెగ మదనపడిపోతున్నారు.
జిల్లా రాజకీయాల్లో కమల వికాసం కోసం చాలా ఏళ్ల నుంచీ కృషి జరుగుతోంది. కమలాన్ని వికసింపచేయాలని దేశంలోని కీలక నేతలు దృష్టి సారించినప్పటికి ఇక్కడ మాత్రం కనీసం జెండా కూడా గట్టిగా ఎగరడం లేదని వాపోతున్నారు కార్యకర్తలు. జిల్లాలో ఉన్నదే కొద్ది మంది నేతలు వారిలో నేత ఇరవై గ్రూపులు ఉండటమే కారణమట.! అందరికీ ఒకే కుర్చీ కావాలని ఆరాటం. ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్ష పదవికి ఏకంగా 25 మంది వరకు పోటీ పడ్డారంటే అర్ధం చేసుకోవాల్సిందే. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయని పలువురు బాహాటంగానే విమర్శించారప్పుడు. తాజా ఎన్నికల్లో సైతం స్థానిక నేతలు ఇష్టం వచ్చినట్టు టిక్కెట్లు ఇచ్చారనీ.. కనీస అర్హత లేని వారు కూడా పోటీ చేశారని.. కార్యకర్తల మాట. దాని ప్రభావంతో పార్టీలో వర్గాలు ఏర్పాడ్డాయని విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జిల్లా అధ్యక్షులు ఎవరన్నది జిల్లా ప్రజలకి కాదు కదా కనీసం పార్టీలోని మూడొంతుల మంది కార్యకర్తలకు కూడా తెలియని వైనం.
ఇక తాజాగా ఏ ప్రామాణికాలు అనుసరించి నూతన అధ్యక్షురాలిని ఎన్నుకున్నారో తెలియని పరిస్థితి. ఆమె కూడా గతంలో ఉన్నోళ్ల మాదిరిగానే ఉన్నారన్న అపవాదు వినిపిస్తోంది. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం కేంద్రంలో కీలక నేత అమిత్ షా మొదలుకొని పలువురు కేంద్ర మంత్రులు వరకు ప్రయత్నించారు. జిల్లాలో పెట్టిన సమావేశాల ప్రభావం నాలుగు గోడలు దాటి బయటకు రాలేకపోయాయని భావన కూడా పార్టీ అభిమానుల్లోను, కార్యకర్తల్లోను నెలకొంది. కనీసం కేంద్రంలో ఏం జరుగుతోంది… కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేస్తుంది.. ఏ పథకాల ద్వారా ఎవరు లబిద్ధి పొందుతున్నారు.. వంటి విషయాలు ప్రజలకి చెప్పే నాయకుడే లేడు. అసలు అలాంటి కార్యక్రమాలు జరగటం లేదనే వాదన కూడా ఉంది. ఇక కేంద్రంలో జాతీయ పార్టీగా రెండో సారి అధికారం చేపట్టిన, బిజేపి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో జిల్లా నేతలు విఫలమవుతూనే వస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ప్రజలకు ఏ మేరకు ఉపయోపడుతుందో వివరించటం మొదలుకొని… రాజధాని అంశం వరకు కనీస కార్యక్రమాలు చేయలేకపోతున్నారనే విమర్శ వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని రాష్ర్ట బిజెపి నేతలు హాట్ కామెంట్స్ తో అగ్గి రాజేస్తుంటే జిల్లాలో కనీసం ఒక్కనేత కూడా నోరుమేదపడంలేదంటూ వాపోతున్నారు కేడర్. పార్టీ సిద్ధాంతాలను వివరించటంలో జిల్లా బిజెపి నేతలు కంటే పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్ధి సంఘం పనితీరు చూసి సిగ్గు తెచ్చుకోవాలని బిజెపి కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోని పోటీ చేసిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేకపోయినప్పటికీ.. వచ్చే ఎన్నికలకైనా కమలం వికసించేలా నేతలు దృష్టిపెట్టాలనికోరుతున్నారు కమలదళం సభ్యులు.