గ్రేటర్ ఎన్నికలు పూర్తై, ఫలితాలు వెల్లడించినందున వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కోరారు. ఫలితాలు ప్రకటించి చాలా రోజులు అయినా గెజిట్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లు ఎస్ఈసీతో సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని, టీఆర్ఎస్ తరుపున ఎక్కువగా కార్పొరేటర్లు గెలవనందుకే ఎస్‌ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అడిగితే ఇంకా సమయం ఉందని, నెల ముందుగా ఇస్తామంటున్నారన్నారు. మరి అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించారని బీజేపీ నేతలు నిలదీశారు. ఎన్నికల కమిషన్ తీరు ఇలాగే ఉంటే న్యాయపోరాటం చేస్తామని, గవర్నర్ ను కూడా కలుస్తామన్నారు. ఎంఐఎంతో కుమ్మక్కైన టీఆర్ఎస్ తెర వెనుక రాజకీయాలు చేస్తుందన్నారు.