– హస్తం నేతలపై కన్నేసిన బీజేపీ
– మర్రి బాటలో మరికొందరు కీలక నేతలు?
– గ్యాప్ లేకుండా జిల్లా నేతలకు ఫోన్లు!
– రేవంత్ అంటే పడని వారిపై మరింత ఫోకస్
– టీపీసీసీపై దృష్టి సారించిన ఏఐసీసీ
– బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు బ్రేక్ వేసే ప్లాన్స్
– త్వరలో కీలక మార్పులు ఉంటాయని వార్తలు
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనేది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదట్నుంచి చెబుతున్న మాట. ఏ సభలో పాల్గొన్నా.. ఏ సమావేశం జరిగినా పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఆ ధైర్యం నింపుతూ వస్తున్నారు. కానీ, సీనియర్ల మనసు మాత్రం దోచుకోలేకపోతున్నారు. రేవంత్ ఏం చేసినా వారికి నప్పడం లేదు. దానికి కారణం వేరే పార్టీ నుంచి వచ్చిన నేత కావడమే. అయితే.. అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని రేవంత్ నిలబెట్టుకుంటూ తన రాజకీయం తాను చేస్తున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలో తమపై నిర్లక్ష్యం వహిస్తున్నారనేది సీనియర్ల వాదన. అందుకే రేవంత్ ది ఒంటెద్దు పోకడగా భావించి పార్టీని వీడుతున్నారు.
మొన్న శ్రవణ్ గానీ, నిన్న మర్రి గానీ.. రేవంత్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. రేవంత్ వర్గం కూడా అదే స్థాయిలో ఎదురుదాడి కొనసాగించింది. ఆయన టీపీసీసీ చీఫ్ అవ్వకముందు పార్టీ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది సోషల్ మీడియా వేదికగా వివరిస్తోంది. రేవంత్ ను తిట్టే వారికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తోంది. నిజానికి టీపీసీసీ పదవి చేపట్టాక.. తనకు జై కొట్టొద్దని సోనియా, రాహుల్ కే జై కొట్టాలన్నారు రేవంత్. ఆయన కూడా ప్రతీ సభలో అదే చేశారు. కానీ, పార్టీని వీడుతున్న సీనియర్లు మాత్రం.. సొంత ఎదుగుదలకే ప్రయత్నిస్తున్నారని తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
మరోవైపు రేవంత్ పై సీనియర్లకు ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో ఉంది బీజేపీ. నెమ్మదిగా ఒక్కొక్కరిని తనవైపు లాగుతోంది. అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీని ఖాళీ చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. త్వరలో మర్రి శశిధర్ రెడ్డి బాటలోనే మరికొందరు నేతలు కాంగ్రెస్ ను వీడతారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ.. హస్తం నేతలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. జిల్లాల్లోని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మునుగోడు ఫలితం అనుకూలంగా ఉంటే వలసల ప్రవాహం అధికంగా ఉండేది. అక్కడ రివర్స్ కొట్టినా కూడా వచ్చిన సెకెండ్ పొజిషన్ ను, ఓట్లను వివరిస్తూ.. తమవైపు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా.. రేవంత్ అంటే పడని నేతలను ఒక్కొక్కరిగా చేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తోందని అంటున్నారు.
మరోవైపు టీపీసీసీ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు. పార్టీ పరిస్థితిపై పోస్ట్ మార్టం నిర్వహించే పనిలో అగ్ర నేతలు బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను కాంగ్రెస్ పెద్దలు నిలువరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈక్రమంలోనే రేవంత్ వన్ మ్యాన్ షో కాకుండా… రెండు, మూడు రకాల కమిటీలను నియమించాలని చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేగనక నిజమైతే.. రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు ఉండే ఛాన్స్ ఉంది.