– కాపుల ఓట్లపైనే పార్టీల ఫోకస్
– ముందస్తు వ్యూహాల్లో వైసీపీ, టీడీపీ, జనసేన
– అదే బాటలో బీజేపీ
– ఏకంగా రాజ్యసభలో రంగా ప్రస్తావన
ఆంధ్రాలో కాపుల ఓట్లు చాలా కీలకం. అత్యధికంగా ఓట్లు ఉన్న సామాజిక వర్గం కావడంతో పార్టీలన్నీ వీరిపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాయి. ఈసారి కూడా ఎన్నో ప్రకటనలు చేస్తున్నారు నేతలు. ఏపీలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే పోటీ ఉంటుంది. టీడీపీ, జనసేన కలుస్తాయనే ప్రచారం నేపథ్యంలో వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా యుద్ధం కొనసాగడం ఖాయం. అయితే.. బీజేపీ మాత్రం టీడీపీ లేని జనసేన బంధం కావాలని కోరుకుంటోంది. అంతా పవన్ చేతుల్లో ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది.
అయితే.. బీజేపీ ఏదో ఒక హడావుడి చేస్తూ సొంతంగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. నిజానికి ఏపీలో బీజేపీకి అంత విషయం లేదు. 2014 ఎన్నికల్లో గెలిచిన సీట్లు టీడీపీ, జనసేనతో ఉన్న పొత్తు కారణంగానే వచ్చాయి. 2019లో ఎవరి దారి వారు చూసుకోవడంతో ఖాతా తెరవలేకపోయింది. అసలు, సీట్లు గెలిచేంత క్యాడర్ బీజేపీకి లేదనేది విశ్లేషకుల వాదన. టీడీపీతో ఎప్పటికీ పొత్తు ఉండదని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. జనసేనపై ఆశలు పెట్టుకున్నారు. పవన్ హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన పైకి చెప్పకపోయినా కమలనాథులకు ఉందని అంటున్నారు.
జనసేనతో పొత్తు ఉన్నా లేకపోయినా.. మోడీ మేనియాతో ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని బీజేపీ సొంత ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోనే కాపులపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏకంగా రాజ్యసభలో వంగవీటి రంగా ప్రస్తావన తీసుకురావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రాలోని కాపు నాయకుల్లో వంగవీటి రంగాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన్ను అభిమానించే కాపులు అధిక సంఖ్యలో ఉంటారు. అందుకే, కాపులకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
ఈ ప్లాన్ వర్కవుట్ అవ్వడం ఏమోగానీ, సోషల్ మీడియాలో బీజేపీపై ట్రోలింగ్ నడుస్తోంది. జీవీఎల్ రంగా పేరు ప్రస్తావిస్తూ.. ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే.. ఇందులో తప్పులేదుగానీ.. సందర్భంగా, అడిగిన ప్రదేశంపై ట్రోలింగ్ జరుగుతోంది. ఓ జిల్లాకు పేరు పెట్టాలంటే ఎక్కడ డిమాండ్ చేయాలి.. ఆ రాష్ట్రంలో మాట్లాడాలి.. అక్కడి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో నిలదీయాలి. కానీ, అలాంటివేమీ చేయకుండా నేరుగా పార్లమెంట్ లో ప్రస్తావిస్తే.. ఏం ఉపయోగం ఉంటుందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు నెటిజన్లు.