కర్ణాటక ఎన్నికలకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేసేందుకు, ప్రణాళికలను రచించేందుకు దేశవ్యాప్తంగా గల 50 మందికిపైగా ఎంపీలను పార్టీ నాయకత్వం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ అధ్యక్షతన శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఎంపీలందరూ సాధ్యమైనంత త్వరగా.. వీలైతే 72 గంటల్లోగా బెంగుళూరు చేరుకోవాలని నిన్నటి సమావేశంలో పాల్గొన్న నేత ఒకరు తెలిపారు.
224 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి 115 నియోజకవర్గాలను పార్టీ గుర్తించిందని, ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరు రెండు. మూడు నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని తీర్మానించారని ఆయన చెప్పారు. బీ కేటగిరీలోని ఈ 115 నియోజకవర్గాలు పార్టీకి కొంత గడ్డు పరిస్థితినే సృష్టించేవని, అయితే గట్టిగా కృషి చేస్తే ఈ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని భావించామన్నారు.
50 మంది పార్టీ నేతల్లో కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి, బీహార్ ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా, ఇంకా రమేష్ బిధూరి, నిషికాంత్ దూబే తదితరులున్నారు. తాను ఇటీవల యూపీ,ఉత్తరాఖండ్, హిమాచల్ తో సహా 9 రాష్ట్రాలు సందర్శించానని, అయితే ఎక్కడినుంచి ప్రచార సంబంధ కార్యక్రమాలు నిర్వహించాలో పార్టీ నాయకత్వం ఆదేశాల కోసం వేచి చూస్తున్నానని బిధూరీ అన్నారు.
ఈ రాష్ట్రాల్లో కార్యకర్తలను మోటివేట్ చేయవలసి ఉందన్నారు. ఝార్ఖండ్ కి చెందిన ఈ ఎంపీ.. భాష విషయంలో తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో మళ్ళీ అధికార పగ్గాలను చేబట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నాయి.