గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుంది అని అవహేళన చేసిన అధికార పార్టీకి.. కమలం చేతిలో ఒక్కో ఎదురుదెబ్బ తగులుతోంది. తాజా ఫలితాల్లో చావు తప్పి కన్ను లోట్టబోయినట్టుగా మాత్రమే టీఆర్ఎస్ తప్పించుకుంది తప్ప.. ఆ పార్టీది అసలైన గెలుపు కాదన్నది విశ్లేషకుల మాట. అతిపెద్ద పార్టీగా అవతరించామంటూ పైకి సౌండ్‌గా వినిపించే పదాలని వల్లెవేయడమే కానీ.. లోపల తాము ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్నామన్న విషయం టీఆర్ఎస్ నేతలకూ తెలుసు. ఈ సంగతి పక్కనబెడితే తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ వాదన ఈ ఎన్నికలతో రుజువైనట్టేనా అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత.. టీఆర్ఎస్ బలం భారీగా పెరిగింది. తొలి, రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. అయితే ఆ రెండు సార్లూ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే కనిపించింది. అందుకు తగట్టే గట్టి పోటీనిచ్చింది. అదే సమయంలో బీజేపీ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితం కావడంతో ఆ పార్టీ పనైపోయినట్టే అనుకున్నారు. కానీ అనూహ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంది. కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ దానికంటే ఒకటి ఎక్కువే సాధించింది. అయినప్పటికీ బీజేపీ గెలుపు వాపు అనుకున్నారే తప్ప బలం అనుకోలేదు. అప్పటికీ కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయ శక్తిగా ఉంది. కానీ దుబ్బాకతోనే రాష్ట్రంలో పొలిటికల్ స్క్రీన్ మారిపోయింది.
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో గ్రేటర్ ఫైట్‌లోకి దిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికార పార్టీకి సరి సమానమైన ఓట్లనూ, విజయాన్ని సాధించింది. గ్రేటర్ గెలపుతో బీజేపీ నెంబర్ టూ పార్టీగా అవతరించినట్టేనా అంటే కచ్చితంగా చెప్పలేని అంశమే. సాధారణంగానే బీజేపీ నగరంలో పట్టున్న పార్టీ. ఈ గెలుపుతో ఆ పట్టు మరింత పెరిగిందనుకోవాలే తప్ప.. కచ్చితంగా ఈ ప్రభావం తెలంగాణ అంతటా ఉంటుదన్న విషయాన్ని అప్పుడే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు.